కరీంనగర్, : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్న ఆలయానికి చెందిన తిప్పాపూర్ గోశాలలో కోడెల మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది.
తాజాగా నేడు మరో అయిదే కోడెలు మృతి చెందాయి. గత మూడు రోజుల్లో 18కి పైగా కోడెలు మృతి చెందడంపై స్థానికంగా కలకలం రేగుతోంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే జిల్లా కలెక్టర్ సందీప్ స్పందించారు. కోడెల సంరక్షణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఆలయంలో మొత్తం 1250 కోడెలు ఉండగా.. వాటిలో 300ను రైతులకు పంపిణీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
మరోవైపు ఈ కోడెల మృతిపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతోన్నాయి. మృతి చెందిన కోడెలను గుట్టు చప్పుడు కాకుండా తీసుకు వెళ్లి.. మూలవాగులో ఖననం చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదీకాక.. అధికారుల నిర్లక్ష్యం కారణంగా గోశాలలోని కోడెలకు మరణిస్తున్నాయని వారు విమర్శిస్తున్నారు.
ఇక వాటిలో చాలా కోడెలకు ట్యాగ్‌లు సైతం లేవని వారు వివరించారు.దీంతో గోశాలలో ప్రస్తుతం ఎన్ని కోడెలు ఉన్నాయి.. మరెన్ని మరణించాయనే విషయాన్ని సైతం అధికారులు స్పష్టంగా చెప్పడం లేదని సందేహం వ్యక్తం చేశారు.
వేములవాడలో కొలువు తీరిన రాజరాజేశ్వర స్వామి వారికి ప్రతి నెల దాదాపు 100కి పైగా కోడెలను భక్తులు మొక్కులుగా చెల్లించుకుంటారని స్థానికులు గుర్తు చేస్తున్నారు. అలా వచ్చిన కోడెలను గోశాలలోని దాదాపు 11 షెడ్లలో ఉంచుతారని చెప్పారు. కానీ ఇటీవల కాలంలో గోశాలలో వరుసగా కోడెలు మృతి చెందుతున్నాయని చెప్పారు. పశు వైద్యులు సైతం అందుబాటులో లేకపోవడంతో ఈ తరహా ఘటనలు చోటుచేసుకొంటున్నాయనే వాదన వినిపిస్తోంది.
ఈ నేపథ్యంలో గోశాలలోని కోడెలను స్వచ్చందంగా రైతులకు అందజేయాలని దేవస్థానం అధికారులు నిర్ణయించారు. మరోవైపు రాజన్న దేవస్థానంలోని గోశాలలో కోడెల మృతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కోడెలను సంరక్షించేందుకు చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గోశాలలను ఆధునీకరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన కీలక సూచనలు చేశారు.