ఎస్‌ఐఆర్ డిజిటలైజేషన్‌ను గడువులోగా పూర్తి చేయాలి: కలెక్టర్ భవేశ్ మిశ్రా
కుంటాల, ఆంధ్రప్రభ : ఎస్‌ఐఆర్ ఎన్యుమరేషన్ డిజిటలైజేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదివారం కుంటాల మండలంలోని కల్లూరు గ్రామంలో పరిశీలించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరుగుతున్న ఎస్‌ఐఆర్ ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ, రికార్డుల నిర్వహణను స్వయంగా తనిఖీ చేశారు.
ఇప్పటివరకు పూర్తయిన డిజిటలైజేషన్ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్న కలెక్టర్, బీఎల్‌ఓ యాప్‌లో నమోదైన సమాచారాన్ని కూడా పరిశీలించారు. ఎలాంటి లోపాలకు తావు లేకుండా పూర్తి పారదర్శకంగా ప్రక్రియను నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్ ప్రక్రియను ఈ నెల 16వ తేదీలోపు పూర్తిచేయాలని సూచించారు. ఫారాలను గడువులోగా బీఎల్‌ఓలకు అందజేసేలా గ్రామాల్లో మైక్‌లు, డప్పు చప్పుళ్ల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు.
ఎన్యుమరేషన్ ప్రక్రియలో నిర్లక్ష్యం ప్రదర్శించే అధికారులను సహించబోమని హెచ్చరించారు. అవసరమైతే సెలవు దినాల్లో కూడా విధులు నిర్వహించాలని, నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
దూర ప్రాంతాల్లో నివసిస్తున్న ఓటర్లకు అవసరమైన అవగాహన కల్పించి, వారి దరఖాస్తు ఫారాలను కూడా గడువులోగా స్వీకరించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కమల్ సింగ్, ఎంపీడీవో అల్లాడి, స్థానిక సర్పంచ్ పెంట్వార్ దశరథ్, వనజ, బీఎల్‌ఓలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
