Chakra Snanam | భక్తి తరంగాల్లో ముగిసిన శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు

Chakra Snanam | భక్తి తరంగాల్లో ముగిసిన శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు

ధ్వజావరోహణంతో నేడు ఉత్సవాలకు మంగళం

Chakra Snanam | తిరుపతి – ఆంధ్రప్రభ : తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం ఉదయం కపిలతీర్థంలో నిర్వహించిన చక్రస్నాన మహోత్సవంతో వైభవంగా ముగిశాయి. వేలాది మంది భక్తులు ఈ దివ్య ఘట్టాన్ని భక్తిశ్రద్ధలతో వీక్షించి పుణ్యఫలాన్ని పొందారు.

Chakra Snanam |
Chakra Snanam |

ఉదయం 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు, చక్రత్తాళ్వార్‌ ఆలయం నుంచి మంగళవాద్యాలు, వేదఘోషలు, గోవింద నామస్మరణల మధ్య ఊరేగింపుగా బయలుదేరి కపిలతీర్థంలోని ఆళ్వార్ తీర్థానికి చేరుకున్నారు. మార్గమధ్యంలో భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారికి ఘన స్వాగతం పలికారు.

అనంతరం ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చందనం, సుగంధ ద్రవ్యాలు, వివిధ రకాల పండ్ల రసాలతో నిర్వహించిన అభిషేకం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించింది.

తదనంతరం చక్రత్తాళ్వార్‌కు వైభవంగా చక్రస్నానం నిర్వహించారు. పవిత్ర తీర్థంలో స్నానాలు ఆచరించిన భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. అనంతరం స్వామివారు టీటీడీ పరిపాలనా భవనం ఎదురుగా ఉన్న పి.ఆర్‌.తోటకు వేంచేశారు.

సాయంత్రం 5 గంటలకు పి.ఆర్‌.తోట నుంచి స్వామివారు ఊరేగింపుగా బయలుదేరి గోవిందరాజస్వామి ఆలయానికి చేరుకోనున్నారు. రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు బంగారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడవీధుల్లో భక్తులకు దివ్య దర్శనమివ్వనున్నారు.

రాత్రి 8.40 గంటల నుంచి 9.30 గంటల వరకు నిర్వహించే ధ్వజావరోహణ మహోత్సవంతో ఈ ఏడాది బ్రహ్మోత్సవాలు అధికారికంగా ముగియనున్నాయి.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌స్వామి, డిప్యూటీ ఈవో శాంతి, ఏఈవో నారాయణ చౌదరి, సూపరింటెండెంట్ చిరంజీవి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ ధనంజయ తదితరులు పాల్గొన్నారు.


Leave a Reply