రాష్ట్రంలో పరిపాలన ‘చెత్త సినిమా’లా ఉంది : మాజీ మంత్రి పువ్వాడ
అశ్వాపురం, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పరిపాలన ఒక చెత్త సినిమాను తలపిస్తోందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అశ్వాపురంలోని నూతన బీఆర్ఎస్ పార్టీ మండల కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుతో కలిసి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఆయన నిప్పులు చెరిగారు.
రేవంత్ సర్కారుకు ఒక నిర్దిష్ట ప్రణాళిక లేదని, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. హైదరాబాద్ లో రైతుల సమస్యలకు పరిష్కారం ఏంటని అడిగితే ప్రతిపక్ష నాయకుల రక్తం పారిస్తామనడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రక్తపిపాసి మనస్తత్వానికి నిదర్శనమన్నారు. “రైతులకు నీళ్లివ్వడానికి మా రక్తమే అడ్డమైతే.. ఆ రక్తాన్ని ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. పాపం పండిన నాడు హిట్లర్‌కు పట్టిన గతే రేవంత్ రెడ్డికి పడుతుంది” అని హెచ్చరించారు. ఎందరో ముఖ్యమంత్రులను చూశామని, కానీ ఇంతటి నోటిదూల ఉన్న సీఎంను ఎప్పుడూ చూడలేదన్నారు.
రిటైర్డ్ ఇంజనీర్ల నివేదిక చూసైనా సోయి తెచ్చుకో..
మేడిగడ్డ గేట్లు మూసివేయకుండానే కన్నెపల్లి పంప్ హౌస్ నుండి నీళ్లు లిఫ్ట్ చేయవచ్చు అని రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం ప్రభుత్వానికి లేఖ రాసినా సీఎం రేవంత్ రెడ్డికి సోయి లేకపోవడం విచారకరమన్నారు. కన్నెపల్లి వద్ద ప్రస్తుతం 96.79 మీటర్ల నీరు ప్రవహిస్తోందని, కానీ 94 మీటర్లకే పంపులు ఆన్ చేయవచ్చని గుర్తుచేశారు. మరో 100 రోజుల పాటు కన్నెపల్లి వద్ద ఇదే తరహా ప్రవాహం ఉంటుందని, రోజుకు 2 టీఎంసీల చొప్పున 100 రోజుల్లో 200 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేస్తే గోదావరి బేసిన్లో ఉన్న అన్ని రిజర్వాయర్లు నింపి సస్యశ్యామలం చేసే అవకాశం ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
“మేము మంత్రిగా ఉన్నప్పుడు ఇదే మేడిగడ్డ నుండి భద్రాచలం వరకు 25 లక్షల క్యూసెక్కుల నీళ్లు తెచ్చాం. అప్పుడు కొట్టుకుపోని భద్రాచలం.. ఇప్పుడు లక్ష క్యూసెక్కులు కూడా లేకపోయినా మునిగిపోతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కాళేశ్వరం నీళ్లు వస్తే ఎక్కడ కేసీఆర్ గొప్పతనం ఒప్పుకోవాల్సి వస్తుందో అని అనేక అబద్ధాలు చెప్పి దాన్ని పండబెడుతున్నారు” అని మండిపడ్డారు. మన పీకల మీద కడుతున్న పోలవరం పూర్తి అయితే భద్రాచలానికి ముప్పు వస్తుంది తప్ప.. మేడిగడ్డ వల్ల కాదని స్పష్టం చేశారు.
హామీల అమలు ఏమైంది?
ఎన్నికల సమయంలో దేవుడి సాక్షిగా, భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి మీద ఆన అని చెప్పిన హామీలను రేవంత్ రెడ్డి గాలికొదిలేశారని పువ్వాడ విమర్శించారు. యూరియా దొరకడం లేదని రైతులు రోడ్డెక్కితే వారు అసలు రైతులే కాదనడం హాస్యాస్పదమన్నారు. డిసెంబర్ 9 నాడే రుణమాఫీ చేస్తామన్న రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఆ ముచ్చటే గుర్తులేదన్నారు. గతంలో రైతుబంధు పెట్టుబడి సాయాన్ని కేవలం ఒకట్రెండు ఎకరాలకు మాత్రమే ఇచ్చి తర్వాత జాడే లేకుండా చేశారని దుయ్యబట్టారు.
అత్తా కోడళ్లకు ఇస్తామన్న మహిళల డబ్బులు ఏమయ్యాయని, పినపాక నియోజకవర్గంలో ఎవరికైనా ఆ డబ్బులు అందుతున్నాయా అని ప్రశ్నించారు. నిరుద్యోగుల పట్ల జాబ్ క్యాలెండర్ మోసపూరితంగా మారిందని, ఫీజు రీఇంబర్స్‌మెంట్ అందక విద్యార్థుల జీవితాలు దారుణంగా తయారయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉచిత విద్యుత్‌కు డిస్కమ్‌ల లింక్ పెట్టి దానిని ఎత్తివేయడానికి కుయుక్తులు పన్నుతున్నారని, తెలంగాణ రాకముందు కాంగ్రెస్ హయాంలో కరెంట్ కష్టాలు, బీఆర్ఎస్ హయాంలో అద్భుత విద్యుత్ సరఫరాను ప్రజలు గమనించారని గుర్తుచేశారు.
అభివృద్ధి పడకేసింది..
బీఆర్ఎస్ హయాంలో పినపాక నియోజకవర్గంలో బీటీపీఎస్ ఫ్యాక్టరీ, మున్సిపల్ అభివృద్ధి, కలెక్టరేట్ల అభివృద్ధిని వేగవంతం చేశామని పువ్వాడ తెలిపారు. కానీ తాము దిగిపోయేటప్పుడు సీతారామ ప్రాజెక్టు, సీతమ్మ సాగర్ ప్రాజెక్టులు ఎక్కడ ఉన్నాయో.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 30 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ అక్కడే ఉన్నాయని, పాలమూరు ప్రాజెక్టు పరిస్థితి కూడా దారుణంగా తయారైందని ఎద్దేవా చేశారు. ఇక్కడి నీళ్లను ఇతర ప్రాంతాలకు తీసుకుపోవడానికి చూపిస్తున్న ఉత్సాహం.. స్థానిక చెరువులు నింపడానికి మంత్రులు ఎందుకు చూపించడం లేదని ప్రశ్నించారు.
రాజీలేని పోరాటాలు చేస్తాం..
సింగరేణిలో అనేక సమస్యలు ఉన్నాయని, వాటిపై పార్టీ పరంగా పెద్ద ఎత్తున పోరాట కార్యక్రమాలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పువ్వాడ అజయ్ కుమార్ వెల్లడించారు. కాంగ్రెస్ చేసే విమర్శలకు బీఆర్ఎస్ పార్టీ భయపడి ముడుచుకు కూర్చోదని, మరింత ఘాటుగా స్పందిస్తూ ప్రజా సమస్యలపై రాజిలేని పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.
విలేకరుల సమావేశం అనంతరం మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్,ఖమ్మం మాజీ లోక్‌సభ ఎంపీ నామా నాగేశ్వరరావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, అశ్వాపురం సెంటర్‌లోని తుళ్లూరి ఫంక్షన్ హాల్‌కు చేరుకున్నారు. అక్కడ యార్లగడ్డ బలరాం మాతృమూర్తి దివంగత యార్లగడ్డ సువర్ణలత దశదిన (పెద్దకర్మ) కార్యక్రమానికి హాజరై, ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ పర్యటనలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు, సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు పార్టీ ముఖ్య శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
