‘ఆంధ్రప్రభ’ కథనానికి అదిరిపోయే రెస్పాన్స్…

  • ఖమ్మం పిస్తా హౌస్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు దాడులు!

ఆంధ్రప్రభ, ఖమ్మం : ఖమ్మం నగరంలోని ప్రముఖ ‘పిస్తా హౌస్’ రెస్టారెంట్‌లో బిర్యానీ తిని ఓ చిన్నారి అస్వస్థతకు గురైన ఉదంతంపై సోమవారం ‘ఆంధ్రప్రభ’ లో ప్రచురితమైన కథనం విద్యానగర్, జిల్లా యంత్రాంగంలో తీవ్ర సంచలనం సృష్టించింది. ‘ఆంధ్రప్రభ ఎఫెక్ట్’తో తక్షణమే స్పందించిన ఆహార భద్రత (ఫుడ్ సేఫ్టీ) శాఖ అధికారులు మంగళవారం సదరు హోటల్‌పై ఆకస్మిక దాడులు నిర్వహించి తనిఖీలు చేపట్టారు.

చిన్నారి అస్వస్థత.. వినియోగదారుడి ఫిర్యాదుతో రంగంలోకి!

నగరంలోని పిస్తా హౌస్ రెస్టారెంట్‌లో కొనుగోలు చేసిన బిర్యాని తిన్న‌ అనంతరం తన కుమార్తె తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఒక వినియోగదారుడు అధికారికంగా ఫిర్యాదు చేశారు. దీనికి తోడు ‘ఆంధ్రప్రభ’లో వచ్చిన కథనంతో ఇన్‌చార్జి జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి ఈ.శరత్ ఆధ్వర్యంలో అధికారులు మంగళవారం హోటల్ వంటశాలపై మెరుపు దాడులు చేశారు.

ఈ తనిఖీల్లో భాగంగా కిచెన్ నిర్వహణ, ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రత లోపాలు, పాత ల్యాబ్ నిల్వ విధానాలను క్షుణ్ణంగా పరిశీలించారు. హోటల్‌లో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కొన్ని లోపాలను గుర్తించిన అధికారులు, తనిఖీలలో భాగంగా రెండు కీలక ఆహార పదార్థాల చట్టబద్ధ (Act) నమూనాలను (Food Samples) సేకరించారు. వీటిని తదుపరి విశ్లేషణ నిమిత్తం హైదరాబాద్‌లోని రాష్ట్ర ఆహార ప్రయోగశాలకు (State Food Laboratory) పంపించారు.

రిపోర్ట్ రాగానే కఠిన చర్యలు: ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ శరత్ హెచ్చరిక

ఈ సందర్భంగా ఇన్‌చార్జి ఫుడ్ సేఫ్టీ అధికారి ఈ. శరత్ మాట్లాడుతూ.. ప్రజల, వినియోగదారుల ఆరోగ్య పరిరక్షణకు ఫుడ్ సేఫ్టీ శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. “ల్యాబ్ నుంచి నివేదికలు అందిన అనంతరం, అందులో తేలే ఫలితాల ఆధారంగా ఆహార భద్రత ప్రమాణాల చట్టం ప్రకారం పిస్తా హౌస్ నిర్వాహకులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ప్రజల ప్రాణాలతో ఆడుకునే ఏ హోటల్ లేదా రెస్టారెంట్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు” అని ఆయన హెచ్చరించారు.

హోటళ్లు, బేకరీల నిర్వాహకులకు గట్టి వార్నింగ్

జిల్లాలోని హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, స్వీట్ షాపులపై తమ శాఖ నిరంతరం నిఘా ఉంచుతుందని, తనిఖీలు ముమ్మరం చేస్తామని అధికారులు తెలిపారు. ఆహార వ్యాపార నిర్వాహకులు తప్పనిసరిగా నాణ్యమైన ముడి పదార్థాలను మాత్రమే వినియోగించాలని, అత్యంత పరిశుభ్రమైన వాతావరణంలో ఆహారాన్ని తయారు చేసి విక్రయించాలని సూచించారు.

వినియోగదారులు కూడా బయట ఆహారం తీసుకునే సమయంలో నాణ్యత విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా నాసిరకం, కలుషితమైన లేదా గడువు ముగిసిన ఆహార పదార్థాలు విక్రయిస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే ఫుడ్ సేఫ్టీ శాఖ దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా అధికారులు విజ్ఞప్తి చేశారు. ఈ తనిఖీల్లో ఫుడ్ సేఫ్టీ శాఖ సిబ్బంది మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.