తాచుపాముల స్వైరవిహారం..

తాచుపాముల స్వైరవిహారం..

సింగ్ నగర్లో ఇద్దరికి పాముకాటు..

పాయకాపురం, ఆంధ్రప్రభ : సింగ్ నగర్లో తాచుపాముల స్వైరవిహారానికి,ఇద్దరికి పాముకాటుకి గురయ్యారు. విజయవాడ నగరం నడిబొడ్డున ఉన్న అజిత్ సింగ్ నగర్, యార్డు రోడ్డు, చల్లగాలి ఐజయ్య వీధిలో ప్రజలు ఇప్పుడు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎటు చూసినా తాచుపాముల స్వైరవిహారం.. అధికారుల తీరుపై స్థానికుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అజిత్ సింగ్ నగర్లోని ఇప్పుడు పాముల గుమ్మంగా మారింది. పగలు,రాత్రి అనే తేడా లేకుండా విషసర్పాలు ఇళ్లలోకి జొరబడుతున్నాయి.

ముఖ్యంగా గత రెండు రోజులుగా ఇక్కడ పరిస్థితి అత్యంత భయానకంగా మారింది. రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు పాము కాటుకు గురికావడం స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. అదృష్టవశాత్తు వారు ప్రాణాలతో బయటపడినప్పటికీ, ఎప్పుడు ఏ పొదలో నుంచి ఏ మృత్యువు దూసుకొస్తుందోనని ప్రజలు వణికిపోతున్నారు. ఇంట్లో పిల్లల్ని ఒంటరిగా వదిలేయాలంటే భయమేస్తోందని స్థానికులు వాపోతున్నారు. స్థానిక కార్పొరేషన్ అధికారులకు, మున్సిపల్ సిబ్బందికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యమని స్థానిక ప్రజలు చెబుతున్నారు.

Leave a Reply