Gold Price | స్వ‌ల్పంగా పెరిగిన పసిడి ధరలు

Gold Price | స్వ‌ల్పంగా పెరిగిన పసిడి ధరలు

Gold Price | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్: గత కొద్ది రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు మళ్లీ పెరుగుదల బాట పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకుంటున్న ఆర్థిక, భౌగోళిక పరిణామాల ప్రభావంతో దేశీయంగా పసిడి ధరలు వరుసగా పెరుగుతున్నాయి. సోమవారం (జూన్ 22) హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మరోసారి ఎగబాకగా, వెండి ధర మాత్రం స్వల్పంగా తగ్గింది. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి అదనపు భారం పడనుంది.

ప్రస్తుతం బంగారం, వెండి ధరల కదలికలను అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై అంచనాలు, అమెరికా డాలర్ బలపాటు, అంతర్జాతీయ ద్రవ్యోల్బణ పరిస్థితులు, ముడి చమురు ధరల మార్పులు ప్రభావితం చేస్తున్నాయి. అలాగే పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయ వాణిజ్య మార్గాలకు సంబంధించిన అనిశ్చితి కూడా విలువైన లోహాల ధరలపై ప్రభావం చూపుతున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు కొంత మేర తగ్గుముఖం పట్టినప్పటికీ, పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గుచూపడంతో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో దేశీయ మార్కెట్లోనూ పసిడి ధరలు పైకి కదులుతున్నాయి.

హైదరాబాద్‌లో ధరలు ఇలా..
సోమవారం (22-06-2026) నాటికి హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.430 పెరిగి రూ.1,46,510కు చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.400 పెరిగి రూ.1,34,300 వద్ద కొనసాగుతోంది. అలాగే 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.320 పెరిగి రూ.1,09,880కు చేరింది. మరోవైపు వెండి ధరలో మార్పుల లేదు. కిలో వెండి ధర రూ.2,55,000 వద్ద కొనసాగుతోంది.

అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితి
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ ముడి చమురు ధర సుమారు 2 శాతం మేర తగ్గి బ్యారెల్‌కు 78 డాలర్ల స్థాయిలో ట్రేడవుతోంది. ఇదే సమయంలో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు సుమారు 30 డాలర్లు పెరిగి 4,195 డాలర్ల స్థాయికి చేరగా, స్పాట్ సిల్వర్ ధర 66.40 డాలర్ల వద్ద కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ 94.48 వద్ద నమోదైంది. ముందు రోజుల్లో అమెరికా ఆర్థిక గణాంకాలు, ఫెడరల్ రిజర్వ్ విధాన నిర్ణయాలు, పశ్చిమాసియా పరిణామాలు, ముడి చమురు ధరల కదలికలపై ఆధారపడి బంగారం, వెండి ధరల్లో మరింత హెచ్చుతగ్గులు కనిపించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.