దేవినేని నెహ్రూ ఆశయాల సాధనే లక్ష్యం..

వైసిపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్
ఘనంగా దేవినేని నెహ్రూ జయంతి వేడుకలు
ఎగ్జిక్యూటివ్ క్లబ్ వద్ద విగ్రహానికి నివాళులు అర్పించిన నాయకులు
నెహ్రూ సేవలు, అభివృద్ధి కార్యక్రమాలను స్మరించిన నేతలు
జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలన్నదే నెహ్రూతో నడిచిన వారందరి ఆకాంక్ష: అవినాష్

విజయవాడ, ఆంధ్రప్రభ: దేవినేని నెహ్రూ ఆశయాలను సాధించే లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని మాజీ మంత్రి దేవినేని నెహ్రూ తనయుడు ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ పేర్కొన్నారు. మాజీ మంత్రి దేవినేని నెహ్రూ జయంతి సందర్భంగా సోమవారం విజయవాడలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, దేవినేని అభిమానులు ఘనంగా నివాళులు అర్పించారు. నగరంలోని ఎగ్జిక్యూటివ్ క్లబ్ వద్ద ఉన్న దేవినేని నెహ్రూ విగ్రహానికి ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు, ఆయన తనయుడు దేవినేని అవినాష్ పూలమాల వేసి నివాళులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, విజయవాడ నగర ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, మాజీ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, నెహ్రూ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. దేవినేని నెహ్రూ ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఐదు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పనిచేసి ప్రజలకు విశేష సేవలు అందించారని పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గంలోని కొండ ప్రాంతాలు, కృష్ణలంక, కరకట్ట ప్రాంతాల ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఆయన ఎప్పుడూ ముందుండేవారని గుర్తు చేశారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ హయాంలో నెహ్రూ నగరాభివృద్ధికి విశేషంగా కృషి చేశారని, ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎవరిని అడిగినా ఆయన చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి చెబుతారని అన్నారు. నెహ్రూతో కలిసి పనిచేసిన ప్రతి ఒక్కరూ ఆయన నాయకత్వం, ప్రజాసేవా తత్వం గురించి ఇప్పటికీ గర్వంగా చెప్పుకుంటున్నారని పేర్కొన్నారు. నెహ్రూతో కలిసి ప్రయాణం చేసిన వారందరి కోరిక జగన్ మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావడమేనని అవినాష్ అన్నారు. తనకు ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్ష పదవి బాధ్యతలు అప్పగించిన జగన్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం జగన్ మళ్లీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దేవినేని నెహ్రూ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ పేద ప్రజలకు అండగా నిలుస్తామని, ప్రజాసేవే తమ లక్ష్యమని అవినాష్ స్పష్టం చేశారు. కార్యక్రమం అనంతరం నాయకులు, కార్యకర్తలు నెహ్రూ సేవలను స్మరించుకుంటూ ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు.