జూనియర్ డాక్టర్ల సమ్మె షురూ

విజయవాడ, ఆంధ్రప్రభ: స్టైపెండ్ పెంపుపై ప్రభుత్వం నుంచి రాతపూర్వక హామీ రాకపోవడంతో ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (ఏపీ జూడా) సమ్మెకు దిగింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో పనిచేస్తున్న ఇంటర్న్లు, పీజీ వైద్యులు, సీనియర్ రెసిడెంట్లు ఫేజ్‌-1 ఆందోళనల్లో భాగంగా సోమవారం నుంచి నిరసన కార్యక్రమాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నాన్‌-ఎమర్జెన్సీ వైద్య సేవలను నిలిపివేశారు. అయితే రోగుల అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఎమర్జెన్సీ, ఐసీయూ సేవలను యథావిధిగా కొనసాగిస్తున్నారు.

ఆగస్టు 12 నుంచి 15వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిరసనలు కొనసాగనున్నట్లు ఏపీ జూడా ప్రకటించింది. స్టైపెండ్ సవరణపై ప్రభుత్వం తక్షణమే స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. ఆగస్టు 15 సాయంత్రం 5 గంటల్లోగా స్టైపెండ్ సవరణకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వు లేదా ఆమోదించిన కాలపట్టికను స్పష్టంగా పేర్కొంటూ లిఖితపూర్వక హామీ ఇవ్వాలని గడువు విధించారు.

గడువులోగా ప్రభుత్వం నుంచి సంతృప్తికరమైన స్పందన రాకపోతే ఆగస్టు 17 నుంచి ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ఏపీ జూడా హెచ్చరించింది. సమ్మె కాలంలో డీఆర్‌పీ, పెరిఫెరల్ పోస్టింగ్స్‌ను కూడా నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. రెసిడెంట్ డాక్టర్ల దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న స్టైపెండ్ సవరణ డిమాండ్‌ను ప్రభుత్వం చర్చల ద్వారా పరిష్కరించాలని కోరుతూ, ఆగస్టు 15లోపు ప్రభుత్వం చర్చలకు వస్తే తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది.