అంతరిక్షం నుంచి భారత్‌కు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

  • భారత జెండాను ప్రదర్శించిన రష్యా వ్యోమగాములు..

న్యూఢిల్లీ, ఆంధ్ర‌ప్ర‌భ : భారతదేశం 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోనున్న వేళ రష్యా వ్యోమగాములు అంతరిక్షం నుంచి భారతీయులకు శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న వ్యోమగాములు భారత త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శిస్తూ సోమవారం ప్రత్యేక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

భారత్‌, రష్యా దేశాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న స్నేహపూర్వక సంబంధాలను ఈ సందర్భంగా వ్యోమగాములు గుర్తుచేశారు. అంతరిక్ష పరిశోధన రెండు దేశాల మధ్య సహకారంలో కీలకమైన రంగంగా కొనసాగుతోందని రష్యా వ్యోమగామి అన్నా కికినా పేర్కొన్నారు.

భారత్‌ ఎనిమిది దశాబ్దాల క్రితం వలస పాలన నుంచి విముక్తి పొంది స్వావలంబన, అభివృద్ధి దిశగా ప్రయాణం ప్రారంభించిందని వ్యోమగామి ప్యోతర్‌ దుబ్రోవ్‌ అన్నారు. 2026లో మానవుడు తొలిసారిగా అంతరిక్షంలోకి వెళ్లి 65 ఏళ్లు పూర్తవుతున్న విషయాన్ని కూడా ఆయన గుర్తుచేశారు. 1961లో సోవియట్‌ వ్యోమగామి యూరీ గగారిన్‌ భారత్‌ను సందర్శించిన విషయాన్ని ప్రస్తావించారు.

అంతరిక్షం నుంచి భారత్‌ ఎంతో అందంగా కనిపిస్తుందని, అయితే నిజమైన స్నేహితులు నివసించే దేశంగా భూమిపై మరింత ప్రత్యేకంగా కనిపిస్తుందని గగారిన్‌ చెప్పిన మాటలను అన్నా కికినా గుర్తుచేశారు. భారత్‌-రష్యా స్నేహం కాలపరీక్షకు నిలిచిందని, అంతరిక్ష రంగంలో సహకారం ఈ బంధానికి ముఖ్యమైన ఆధారంగా ఉందని పేర్కొన్నారు.

అంతరిక్ష సహకారానికి ఎన్నో మైలురాళ్లు..

భారత్‌, రష్యాల అంతరిక్ష సహకారం 1975లో సోవియట్‌ యూనియన్‌ భారత్‌ తొలి ఉపగ్రహం ఆర్యభట్టను ప్రయోగించడంతో కీలక దశకు చేరుకుంది. అనంతరం 1984లో రాకేశ్‌ శర్మ సోవియట్‌ సోయుజ్‌-టీ11 అంతరిక్ష నౌక ద్వారా అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు.

ప్రస్తుతం భారత్‌ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గగన్‌యాన్‌ మానవ సహిత అంతరిక్ష కార్యక్రమంలోనూ రష్యా సహకారం కొనసాగుతోంది. భారత వ్యోమగాములు రష్యాలోని యూరీ గగారిన్‌ వ్యోమగామి శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందారు.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భారత త్రివర్ణ పతాకంతో పాటు యూరీ గగారిన్‌, రాకేశ్‌ శర్మ, గగన్‌యాన్‌ కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్లను కూడా వ్యోమగాములు ప్రదర్శించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత్‌కు శాంతి, సుసంపన్నత కలగాలని ఆకాంక్షిస్తూ.. భారత్‌-రష్యా స్నేహం మరింత బలపడాలని వారు శుభాకాంక్షలు తెలిపారు.