సర్ ప్రక్రియలో భారీగా తగ్గిన ఓటర్ల సంఖ్య
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఓట్ల కోత
డిజిటలైజేషన్ నెమ్మదించడంతో అధికారుల్లో ఉత్కంఠ
సొంత రాష్ట్రాల వైపు సెటిలర్ ఓటర్ల మొగ్గు
ఈ నెల 17న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల
తుది ఓటర్ల జాబితాపై అందరి దృష్టి
హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో కీలకమైన ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణ గడువు ముగిసింది. బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ తిరిగి ఎన్యూమరేషన్ ఫారాలను సేకరించే ప్రక్రియ సోమవారంతో పూర్తి కాగా సేకరించిన సమాచారాన్ని ఆన్లైన్లో నమోదు చేసే డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు.
రాష్ట్రంలోని ఏ ఒక్క జిల్లాలోనూ ఇప్పటివరకు 100 శాతం డిజిటలైజేషన్ పూర్తి కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 3.38 కోట్ల మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ పత్రాలను పంపిణీ చేయగా అధికారులు ఇప్పటివరకు 2.64 కోట్ల పత్రాల డిజిటలైజేషన్ ప్రక్రియను మాత్రమే పూర్తి చేయగలిగారు.
రాష్ట్రంలో దాదాపు 69 లక్షల మంది ఓటర్లు ఇప్పటివరకు తమ వివరాలు లేదా ఎన్యూమరేషన్ ఫారాలను అధికారులకు సమర్పించలేదు. ఇల్లు మారడం, ఊరిలో అందుబాటులో లేకపోవడం, మరణించడం లేదా నకిలీ ఓట్లు ఉండటం వల్ల ఈ స్థాయిలో ఫారాలు ఇంకా స్వీకరించలేదని తెలుస్తోంది.
రాష్ట్రంలో దాదాపు 40 లక్షల మంది సెటిలర్ ఓటర్లు సొంత రాష్ట్రాలకు తరలిపోవడంతో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఆ మేరకు ఓట్లలో కోతపడింది. గ్రామీణ ప్రాంతాల్లో మరో 30 లక్షల ఓట్లకు గండిపడగా మొత్తంగా 74 లక్షల ఓట్లు తొలగింపునకు సిద్ధం చేసింది.
ఈ నెల 17న ముసాయిదా ఓట్ల జాబితాలో తొలగింపుల జాబితాతోపాటు మొత్తం ఓట్ల విషయాలపై స్పష్టత రానుంది.
తెలంగాణలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న ఏపీ, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల ఓటర్లు సొంత రాష్ట్రాల్లో ఓటు హక్కు కొనసాగింపుకు మొగ్గు చూపారు. అంతేకాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన పౌరులు హైదరాబాద్‌లో సొంత ఇల్లు ఉన్నప్పటికీ రేషన్ కార్డు ఉన్న సొంతూళ్లలోనే ఓటు హక్కుకు ప్రాధాన్యత ఇవ్వడం విశేషం.
రేషన్ కార్డుతోపాటు సంక్షేమ పథకాల భయంతో, ఆందోళనతో గ్రామాలకు ఓటు హక్కును తరలించుకున్నట్టుగా ఈసీ చెబుతోంది.
హైదరాబాద్‌లో నెమ్మదించిన ప్రక్రియ
రాజధాని హైదరాబాద్‌లో సర్ ప్రక్రియ మరీ మందకొడిగా సాగింది. హైదరాబాద్ జిల్లాలో డిజిటలైజేషన్ ప్రక్రియ ఇప్పటివరకు 60 శాతం కూడా దాటకపోవడం గమనార్హం.
మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లోనూ ఇదే తరహాలో మందగమనం చోటు చేసుకుంది. డిజిటలైజేషన్ పూర్తయిన అనంతరం ఈ నెలలోనే డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను విడుదల చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం గడువును మరో వారం రోజులు పొడిగించినప్పటికీ హైదరాబాద్‌లో డిజిటలైజేషన్ ప్రక్రియ ఆశించిన స్థాయిలో వేగం పుంజుకోకపోవడం గమనార్హం.
ఎలక్షన్ కమిషన్ పొడిగించిన ఏడు రోజుల గడువులో ఎన్యూమరేషన్ పత్రాల సమర్పణ కేవలం నాలుగు శాతం లోపే పెరిగినట్లు అధికారులు గుర్తించారు.
ప్రజల నుంచి తగినంత స్పందన రాకపోయినప్పటికీ, బూత్ స్థాయి అధికారులు మాత్రం సెలవు రోజుల్లో కూడా విధుల్లో పాల్గొంటూ ఇళ్లకు వెళ్లి ఫారాలను సేకరించారు.
నగరంలో సుదీర్ఘకాలంగా నివాసముంటున్న ఓటర్లలో చాలామంది తమ సొంత గ్రామాలు, స్వస్థలాల్లోనే ఓటు హక్కును ఉంచుకోవడానికి మొగ్గు చూపడమే సర్ ప్రక్రియ నెమ్మదించడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.
74 లక్షల ఓట్లపై ఉత్కంఠ
రాష్ట్రంలోని మొత్తం 3.39 కోట్ల ఓటర్లలో దాదాపు 74 లక్షల ఓటర్లకు సంబంధించిన ఎన్యూమరేషన్ ఫారాలు బీఎల్వోలకు చేరాల్సి ఉన్నది.
ఇప్పటివరకు అమలులో ఉన్న షెడ్యూలు ప్రకారం ఈ నెల 17న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల కానున్నది. ఆ తర్వాత ఏం జరగనున్నదనేది కీలకంగా మారింది.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో భారీగా కోత
హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో 60 శాతం వరకే ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ జరిగింది.
ఇందుకు ఓటర్లు తరలిపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది.
ఈ ప్రాంతాల్లోనే స్థానికేతరులు, సెటిలర్ ఓటర్లు ఉపాధి, విద్య, ఉద్యోగ అవకాశాల కోసం నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు.
గ్రామీణ జిల్లాల్లో యాదాద్రి, జనగామ తదితర జిల్లాల్లో 95 శాతంపైగా ఎన్యూమరేషన్ డిజిటలైజేషన్ జరిగింది.
ఈ నెల 17న ముసాయిదా జాబితా
సర్ సర్వే ప్రక్రియ ముగియడంతో ఈ నెల 17న రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేయనున్నారు.
అదే రోజు నుండి ఓటర్ల నుంచి క్లెయిమ్‌లు, అభ్యంతరాలను స్వీకరించనున్నారు.
అనంతరం నోటీసుల జారీ, క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిశీలన, పరిష్కార ప్రక్రియ సెప్టెంబరు 17 నుండి అక్టోబరు 15 వరకు కొనసాగనుంది.
అన్ని ప్రక్రియలు పూర్తయిన తర్వాత అక్టోబరు 19న తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించనుంది.
