గుడివాడ ఆస్పత్రి సిబ్బందిపై శాఖాపరమైన విచారణ

అవకతవకలు, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలు..

11 మందిపై ప్రభుత్వం చర్యలు

గుడివాడ, ఆంధ్రప్రభ: కృష్ణా జిల్లా గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో పనిచేసిన 11 మంది అధికారులు, సిబ్బందిపై శాఖాపరమైన విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. గతంలో అవకతవకలు, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలతో పాటు ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారంటూ ఫిర్యాదులు అందడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ జాబితాలో మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎస్‌.ఇందిరాదేవి, డెంటల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ డాక్టర్‌ జి.ఎం.వేణుగోపాల్‌, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు డాక్టర్‌ డి.యాదయ్య, డాక్టర్‌ కె.వి.ఎస్‌.సత్యనారాయణ, డాక్టర్‌ సీహెచ్‌.రాజ్‌కుమార్‌, డాక్టర్‌ గట్టం లీనా, డాక్టర్‌ టి.సూదేశకుమార్‌, ఫార్మాసిస్ట్‌ గ్రేడ్‌-2 బి.విజయకుమార్‌, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ ఎస్‌.నరసింహారావు, హెడ్‌నర్స్‌ సీహెచ్‌.విజయకుమారి, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ ఎన్‌.పద్మజ ఉన్నారు.

ఈ శాఖాపరమైన విచారణకు ప్రకాశం జిల్లా డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ కె.వి.లక్ష్మీకుమారిని విచారణ అధికారిగా ప్రభుత్వం నియమించింది. నిర్ణీత గడువులోగా విచారణ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అలాగే విచారణలో ప్రభుత్వ తరఫున వాదనలు వినిపించే ప్రెజెంటింగ్‌ అధికారిగా ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌ జి.వి.వి.సత్యనారాయణను నియమించింది. ఆరోపణలకు సంబంధించిన అంశాలను పరిశీలించి, విచారణ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.