సైబర్ కాల్ సెంటర్ల గుట్టురట్టు
- తెలంగాణ యువతులతో మోసాల నిర్వహణ..
- 21 మంది టెలికాలర్లు అదుపులోకి
దిల్లీ, ఆంధ్రప్రభ: దేశ రాజధానిలో సాగుతున్న భారీ సైబర్ మోసాల నెట్‌వర్క్‌ను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు ఛేదించారు. ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న మూడు సైబర్ నేర కాల్ సెంటర్లపై ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి 21 మంది తెలుగు యువతులతో పాటు ఓ బ్యాంక్ ఖాతాదారుడిని అదుపులోకి తీసుకున్నారు.
కాల్ సెంటర్ల నిర్వాహకులు అలిషింగ్, కుల్దీప్ సింగ్, అనిల్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తెలంగాణకు చెందిన యువతులను టెలికాలర్లుగా నియమించుకుని ఈ ముఠా గత ఏడాదిన్నరగా సైబర్ మోసాలకు పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడైంది.
పోలీసుల వివరాల ప్రకారం.. నిందితులు బజాజ్ ఫైనాన్స్ ప్రతినిధులమంటూ బాధితులకు ఫోన్లు చేసేవారు. రుణం మంజూరు చేస్తామంటూ ప్రాసెసింగ్ ఫీజు, ధ్రువీకరణ రుసుము, పత్రాల పరిశీలన రుసుము తదితర పేర్లతో డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించారు.
ఈ ముఠాతో తెలంగాణ వ్యాప్తంగా నమోదైన 22 సైబర్ మోసాల కేసులకు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. దాడుల్లో 23 మొబైల్ ఫోన్లు, రెండు బ్యాంక్ పాస్‌బుక్‌లను స్వాధీనం చేసుకున్నారు.
అదుపులోకి తీసుకున్న వారిలో ఎక్కువ మంది హైదరాబాద్‌లోని సైదాబాద్, బోరబండ, మహబూబ్‌నగర్ ప్రాంతాలకు చెందిన వారితో పాటు ఇతర ప్రాంతాల యువతులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.
