Fuel crisis | భారత్‌కు పెరుగుతున్న ఇంధన ముప్పు

Fuel crisis | భారత్‌కు పెరుగుతున్న ఇంధన ముప్పు
Fuel crisis | ఇరాన్-అమెరికా యుద్ధ ప్రభావం
హార్ముజ్ జలసంధి ప్రాధాన్యం
ద్రవ్యోల్బణం, ఆర్థిక వ్యవస్థపై దెబ్బ
స్వయం సమృద్ధి అవసరం ఎందుకు?
Fuel crisis | ఇరాన్‌పై యుద్ధం ఆరంభించిన వెంటనే అయతుల్లా ఖమేనీని అంతమొందించిన అమెరికా సంబరాలు చేసుకుంది. ఖమేనీ అంతంతో ఇరాన్ తన చేతుల్లోకి వచ్చేసిందని భ్రమపడింది. ఇరాన్‌ను తక్కువ అంచనా వేసింది. కొద్ది రోజుల్లోనే యుద్ధం ముగుస్తుందని ట్రంప్ పేర్కొన్నా, వాస్తవం అందుకు విరుద్ధంగా సాగింది. 50 రోజులు దాటినా ఇప్పటికీ యుద్ధానికి ముగింపు కార్డు పడలేదు. అమెరికా కాల్పుల విరమణ బూటకంగా మారింది.
ట్రంప్ మాటలు కోటలు దాటినా, ఇరాన్ విషయంలో అమెరికా తప్పటడుగులు వేసిందని యావత్ ప్రపంచం భావిస్తోంది. ఇరాన్ అణు కార్యక్రమం చేపట్టిందనే ఆరోపణతో, ఆ దేశంలో యురేనియం నిల్వలు ఉండరాదనే పట్టుదలతో ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై దండెత్తిన అమెరికాకు శృంగభంగం జరిగింది. అమెరికా ఖరీదైన ఆయుధాలను ఇరాన్ వ్యూహాత్మకంగా విధ్వంసం చేసింది.
అమెరికా ప్రజల్లోను, రిపబ్లికన్ పార్టీలోను, మిత్ర దేశాల్లోను ట్రంప్ పట్ల ఏహ్యభావం కలిగింది. అమెరికా ఆర్థికంగాను, ఆయుధ పరంగాను భారీ మూల్యం చెల్లించింది. ట్రంప్ అహంకారం ప్రపంచాన్ని ఇంధన సంక్షోభంకు గురి చేసింది. సప్లై చైన్‌లు విచ్ఛిన్నం కావడంతో ప్రపంచ దేశాలు తీవ్రమైన చమురు కొరతను ఎదుర్కొంటున్నాయి.
ప్రపంచ దేశాలన్నీ దుమ్మెత్తిపోసే స్థితి రావడంతో, పదవీ గండం ముంచుకొస్తుండటంతో ఎలాగైనా యుద్ధాన్ని ముగించాలని ట్రంప్ ఆరాటపడుతున్నా, ఇరాన్ పలు షరతులను విధించడం వల్ల వాటిని అంగీకరించడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో ఇరాన్‌లోని నౌకాశ్రయాలను అమెరికా దిగ్బంధించింది.
‘సీ మైన్స్’ పేరుతో హార్ముజ్ జలసంధిని అడ్డంగా పెట్టుకుని అమెరికాకు ఐఆర్‌జీసీ పట్టపగలే చుక్కలు చూపిస్తోంది. హార్ముజ్ జలసంధిపై పూర్తి అధికారం తనకే ఉండాలని ఇరాన్ పట్టుబడుతుంటే, అందుకు అమెరికా ససేమిరా అంటోంది. అమెరికా గనుక హార్ముజ్‌ను ఇరాన్‌కు వదిలేస్తే, అది ప్రత్యక్షంగా చైనాకు ఉపకరించినట్లే.
చైనా చెప్పుచేతల్లో నడుస్తున్న ఐఆర్‌జీసీ ఖచ్చితంగా హార్ముజ్‌ను పరోక్షంగా చైనా చేతుల్లో పెట్టదనే హామీ లేదు. దీని వలన భారత్‌కు తీవ్రమైన నష్టం వాటిల్లే అవకాశముంది. భారత్ ఆర్థికంగా మరింతగా దెబ్బతినే ప్రమాదం ఉంది. హార్ముజ్ జలసంధి ద్వారా భారత్‌కు 50 శాతం పైగా ముడి చమురు, ఎల్‌ఎన్‌జీ దిగుమతి కావడమే ఇందుకు కారణం. ఇంధన సంక్షోభం భారత్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.
ఒకప్పుడు ఇరాన్ నుండి అత్యధికంగా చమురు దిగుమతి చేసుకునే భారత్‌ను అమెరికా కట్టడి చేసింది. రష్యా నుండి చమురు కొనుగోలును ఆపాలని ఒత్తిడి చేసింది. ట్రంప్ ఆజ్ఞలను శిరసావహించి భారత్ కష్టాలను కొని తెచ్చుకుంది. అయినప్పటికీ ట్రంప్ భారత్ పట్ల సానుకూల దృక్పథం ప్రదర్శించకుండా తూలనాడడం ఆక్షేపణీయం.
ట్రంప్ తెంపరితనం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేసింది. రష్యా–ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం ఐదవ సంవత్సరంలోకి ప్రవేశించింది. ఈ యుద్ధం వల్ల ప్రపంచ దేశాలు గత కొన్నేళ్లుగా ఆర్థిక మాంద్యంను ఎదుర్కొంటున్నాయి. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నా, రష్యా భారత్‌కు భారీగా చమురు సరఫరా చేసి అండగా నిలిచింది.

రష్యాపై అక్కసుతో భారత్‌ను అమెరికా కట్టడి చేస్తూ, తన అనుమతితోనే రష్యా నుండి ఆయిల్ దిగుమతి చేసుకోవాలని హుకుం జారీ చేయడం తీవ్ర అభ్యంతరకరం. ఇప్పటికే మన దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రైతులు, వాహనదారులు డీజిల్, పెట్రోల్ కొరతతో మండుటెండల్లో ఆయిల్ బంకుల వద్ద క్యూలో నిలబడి తీవ్ర అవస్థలు పడుతున్నారు.
గ్యాస్ కొరతతో పల్లెల్లో చాలా టిఫిన్ సెంటర్లు, కర్రీ పాయింట్లు మూతబడ్డాయి. పలుచోట్ల కట్టెల పొయ్యిలను ఆశ్రయిస్తున్నారు. ఎందుకీ దురవస్థ? దిగుమతులపై అధికంగా ఆధారపడడం వలననే భారత్‌లో ఇంధన సంక్షోభం ఏర్పడింది.
ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించకుండా ఇతర దేశాలపై ఆధారపడడం వల్లే భారత్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. రూపాయి విలువ క్షీణించింది. ఇప్పటి వరకు నాల్గవ స్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ, జపాన్, యూకే కంటే వెనకబడి ప్రస్తుతం ఆరవ స్థానానికి దిగజారింది.
ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే దేశంలో ద్రవ్యోల్బణ సమస్య తీవ్రంగా మారే అవకాశం ఉంది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటే ప్రమాదం లేకపోలేదు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని దళారులు కృత్రిమ కొరత సృష్టించే అవకాశాలు ఉన్నాయి.
ప్రస్తుతం దేశంలోనూ, తెలుగు రాష్ట్రాల్లోనూ పెట్రోల్, డీజిల్‌కు కొరత లేకపోయినా, ధరలు పెరుగుతాయనే భయంతో ప్రజలు అవసరానికి మించి కొనుగోలు చేస్తున్నారు. కొంతమంది ఆయిల్ డీలర్లు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనే వార్తలు వెలువడుతున్నాయి.
ఆయిల్ బంకుల డీలర్లకు క్రెడిట్ సదుపాయం లేకపోవడం, ధరలు పెరుగుతాయనే కారణంతో ఆయిల్ కంపెనీలు సరఫరాను నిలిపివేయడం కూడా ప్రస్తుత ఇంధన సంక్షోభానికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఏది ఏమైనప్పటికీ భారత్ ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించాలి. సోలార్ ఎనర్జీని మరింత ప్రోత్సహించాలి. ఇథనాల్ ఆధారిత వాహనాలను యుద్ధ ప్రాతిపదికపై మార్కెట్‌లోకి తీసుకురావాలి. విద్యుత్ వాహనాల వినియోగం పెంచాలి. గ్యాస్‌కు ప్రత్యామ్నాయ పద్ధతులును ఆచరణలోకి తీసుకురావాలి.
సుంకవల్లి సత్తిరాజు
9704903463
