TDP Mahanadu 2026 | చమురు సంక్షోభంతో వేడుకపై ఉత్కంఠ
TDP Mahanadu 2026 | చమురు సంక్షోభంతో వేడుకపై ఉత్కంఠ
TDP Mahanadu 2026 | మూడు రోజుల నుంచి రెండు రోజులకు కుదింపు
ప్రతినిధుల సభకే పరిమితమయ్యే ఆలోచన
బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌లో సహచర మంత్రులతో యువనేత సమాలోచనలు
మంత్రుల అభిప్రాయ సేకరణ.. ఒకటి రెండు రోజుల్లో స్పష్టత
TDP Mahanadu 2026 | అమరావతి, ఆంధ్రప్రభ: తెలుగుదేశం పార్టీ సాంప్రదాయ పండుగ మహానాడుపై సస్పెన్స్ నెలకొంది. మధ్యప్రాచ్య యుద్ధ నేపథ్యంలో చమురు సంక్షోభం నెలకొంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ 10 పొదుపు సూత్రాలను ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో చమురు సంక్షోభం వచ్చే పరిస్థితులు ఉండడంతో మహానాడు నిర్వహణపై తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం తర్జన భర్జన పడుతోంది.
వాస్తవంగా ఈనెల 27 నుంచి 29 వరకు నెల్లూరులో మహానాడు నిర్వహించేందుకు అత్యంత ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ప్రధాని పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పొదుపు చర్యలకు దిగింది. చమురు సంక్షోభం వచ్చే అవకాశాలు ఉండడంతో శుక్రవారాన్ని ‘నో వెహికిల్ డే’గా సీఎం చంద్రబాబు ప్రకటించడంతో పాటు తన వాహన కాన్వాయ్‌ను కుదించుకున్నారు.
అలాగే ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో పాటు నారా లోకేష్, ఇతర మంత్రుల కాన్వాయ్‌లో వాహనాల సంఖ్య తగ్గింది. ఈ పరిస్థితుల్లో అత్యంత భారీ ఖర్చుతో పసుపు పండుగ నిర్వహణ సరికాదేమో అనే ఆలోచనలో టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నారు. ఈ నేపథ్యంలో గురువారం టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ఉండవల్లి నివాసంలో క్యాబినెట్ భేటీకి ముందు ఆనవాయితీగా నిర్వహించే బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌లో సహచర మంత్రులతో మహానాడు నిర్వహణపై చర్చించారు.
ఈ సందర్భంగా కొందరు మంత్రులు ఒకవైపు పొదుపు చర్యలు అని మాట్లాడుతున్న పరిస్థితుల్లో మరోవైపు మహానాడు ఘనంగా నిర్వహిస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇదే సందర్భంలో మరికొందరు మంత్రులు మహానాడును మూడు రోజుల నుంచి రెండు రోజులకు కుదించి కేవలం ప్రతినిధుల సభను మాత్రమే నిర్వహిస్తే బాగుంటుందని యువనేతతో చెప్పారు. బహిరంగ సభ నిర్వహణను ఉపసంహరించుకుని ప్రతినిధుల సభను రెండు రోజులపాటు ప్రాంతాలవారీగా నిర్వహించాలని సూచించారు.
ఇదే సందర్భంలో కొందరు మంత్రులు మహానాడుకు భారీ ఏర్పాట్లు చేసి ఇప్పుడు రద్దు చేస్తే కార్యకర్తలు, పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహం నెలకొంటుందని యువనేతతో అన్నారు. మంత్రుల అభిప్రాయాలను సావధానంగా విన్న యువనేత లోకేష్ స్ట్రాటజీ కమిటీలో చర్చించి ఒక నిర్ణయానికి వద్దామని స్పష్టం చేశారు. అధినేత చంద్రబాబుతో మాట్లాడి తుది నిర్ణయం తీసుకుందామని అన్నారు.
రెండు రోజులపాటు మహానాడు..?
ఇదిలా ఉంటే మహానాడును రెండు రోజులపాటు నిర్వహించే దిశగా అధిష్ఠానం ఆలోచన చేస్తున్నట్లుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి. రెండు రోజులపాటు ప్రతినిధుల సభ నిర్వహించి జనసమీకరణకు ఆస్కారం ఇవ్వకుండా వేడుక నిర్వహించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రాంతాల వారీగా పార్టీ ప్రతినిధులను ఆహ్వానించి దుబారాను అరికట్టాలన్న ఆలోచనలో పార్టీ అధిష్ఠానం ఉందని సమాచారం.
