గోపాలపురంలో నూతన పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన
ఎ.కొండూరు, ఆంధ్రప్రభ : రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో పరిపాలన భవనాలు ఉండాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం నూతన పంచాయతీ భవనాలను మంజూరు చేస్తుందని తిరువూరు నియోజకవర్గ శాసన సభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. ఎ.కొండూరు మండలం గోపాలపురం గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి ఆయన సంబంధిత అధికారులతో కలిసి శనివారం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. మండలంలో గోపాలపురం గ్రామంతో పాటు కేశ్యా తండా, మత్రియా తండా గ్రామాలకు కూడా నూతన పంచాయతీ భవన నిర్మాణాలకు అనుమతులు వచ్చాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామీణ ప్రాంతాల అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తున్నారని గ్రామీణ ప్రాంతాల్లో బీటీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో పరిపాలనా భవనాలు ఉంటేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ప్రజలకు సేవలు చేయటానికి పంచాయతీ అధికారులు అందుబాటులో ఉంటారన్నారు. మండలంలో ప్రతి తండాలో పూరి గుడిసె అనేది లేకుండా పక్కా ఇళ్ల నిర్మాణం జరిగే విధంగా అందరూ కలిసికట్టుగా పనిచేద్దామని నాయకులకు, అధికారులకు పిలుపునిచ్చారు. నూతనంగా గృహాలను నిర్మించుకునేవారు ప్రతి ఒక్కరూ పక్కా ఇంటి కోసం దరఖాస్తును సంబంధిత అధికారులకు అందజేయాలని కోరారు.
అలానే మండలంలో 13 హెల్త్ సెంటర్ లకు మరమ్మత్తులు నిమిత్తం నిధులు మంజూరు అయ్యాయని, అలానే ఎక్కడైనా నూతన భవనాలు మంజూరుకు కూడా ప్రభుత్వం నిధులు ఇచ్చే విధంగా కృషి చేస్తుందని తెలిపారు. కిడ్నీ వ్యాధుల సమస్యల పరిష్కారం దిశగాకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల అనతి కాలంలో మండలంలోని 21 గ్రామ పంచాయతీలకు కృష్ణా జలాలను ట్రయల్ రన్ ద్వారా అందించడం జరుగుతుందన్నారు.
కృష్ణా జలాల సరఫరాతో తండాలు గ్రామీణ ప్రాంతాల్లో కిడ్నీ వ్యాధులు తగ్గుముఖం పట్టాయన్నారు.కిడ్నీ వ్యాధుల శాశ్విత పరిష్కార దిశగా కూటమి ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలకు ముందుంటుందని తెలిపారు.కిడ్నీ వ్యాధిని ఈ మండలంలో లేకుండా చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. అలానే నూతన భవనానికి భూమిని భూ విరాళంగా ఇచ్చిన దాతలను ఎమ్మెల్యే ఆత్మీయ ఆలింగనం చేసుకొని వారికి నూతన వస్త్రాలను బహుకరించి శాలువాతో సత్కరించారు.
ఏదైనా ప్రభుత్వ భవనం నిర్మాణం చేపట్టాలంటే స్థలం కోసం ప్రభుత్వ అధికారులు నానా అవస్థలు పడుతున్న రోజుల్లో ఇదే గ్రామానికి చెందిన అన్నదమ్ములు బత్తుల వెంకటేశ్వరరావు, వెంకట రామారావు ప్రభుత్వ భవనానికి నేషనల్ హైవే పక్కన ఉన్న ఖరీదైన స్థలాన్ని అందించడం హర్షించదగ్గ విషయమన్నారు. నూతన భవన నిర్మాణ పనుల విషయంలో అలసత్వం వహించకుండా అధికారులు పనులు వేగవంతం అయ్యేలా దగ్గర ఉండి నాణ్యత ప్రమాణాలతో భవనాన్ని పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఈజిఎస్ పిడి అర్సపల్లి రాము,డిపిఓ లావణ్య,టి.బాపిరెడ్డి తహసీల్దార్ టి.లక్ష్మీ ఎంపీడీవో బి. శ్రీనివాసరావు,ఏపిఎం యెహోషువ,ఏపీవో అనురాధ,రాష్ట్ర మాదిగ కార్పోరేషన్ డైరెక్టర్ వాసం మునియ్య, మండల టిడిపి సీనియర్ నాయకులు గడ్డి కృష్ణారెడ్డి,సర్పంచ్ కోలా శ్రీను,సచివాలయ కార్యదర్శి సిహెచ్. అంజనాదేవి,గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు బి.గోపిరాజు సంబంధిత శాఖ అధికారులు గ్రామస్తులు పాల్గొన్నారు.
