మాజీ మంత్రి కారుమూరిని కలిసిన వైసీపీ నేతలు.

అండగా ఉంటాం అధైర్య పడొద్దు నేతలు ఓదార్పు.

నర్సాపురం, ఆంధ్రప్రభ : మద్యం కుంభకోణం కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్ అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కారుమూరి నాగేశ్వరరావు ను పరామర్శించేందుకు పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు ఆయన నివాసానికి తరలి వెళ్తున్నారు. శనివారం ఉదయం శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు, మాజీ మంత్రులు తానేటి వనిత, చెల్లుబోయిన వేణు, పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు తదితరులు హైదరాబాద్ లోని కారుమూరి నివాసానికి వెళ్లి పరామర్శించి ఓదార్చారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే వైసీపీ నేతలు, వారి కుటుంబ సభ్యులను ప్రభుత్వం అక్రమంగ కేసులు బనాయించి అరెస్ట్ లు చేస్తోందని మండి పడ్డారు. పార్టీకి చెందిన జిల్లా నేత కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ అరెస్ట్ కూడా ఇందులో భాగమే అన్నారు. అక్రమ అరెస్టులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. ప్రజా ఆదరణ పొందుతున్న యువ నాయకుడిని లక్ష్యంగా చేసుకుని అరెస్టు చేసి కారుమూరి కుటుంబాన్ని రాజకీయంగా అణచివేయాలనే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ విభేదాలు సహజమే అయినప్పటికీ, కక్ష సాధింపు రాజకీయాలు ప్రజలకు మంచివి కావని అభిప్రాయపడ్డారు. కారుమూరిని పరామర్శించిన వారిలో నరసాపురం పార్లమెంట్ ఇన్‌చార్జ్ గూడూరి ఉమాబాల, శాసనమండలి సభ్యులు కవురు శ్రీనివాస్, భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త చినిమిల్లి వెంకట్రాయుడు, పాలకొల్లు నియోజకవర్గ సమన్వయకర్త గుడాల గోపాలరావు, పశ్చిమ గోదావరి జిల్లా డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ యడ్ల తాతాజీ, వైసీపీ జిల్లా ఐటీ విభాగం అధ్యక్షులు బుడితి సుమన్ కుమార్ తదితరులు ఉన్నారు.