ఇంద్రకీలాద్రిపై వైభవంగా చండీ హోమం
అమావాస్య సందర్భంగా ప్రత్యేక సేవ..
భక్తిశ్రద్ధలతో పాల్గొన్న 300 మందికి పైగా భక్తులు
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో బుధవారం చండీ హోమాన్ని వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన అమావాస్య రోజున చండీ హోమం నిర్వహిస్తే సకల శుభాలు కలుగుతాయన్న విశ్వాసంతో 300 మందికి పైగా భక్తులు ఈ ప్రత్యేక సేవలో పాల్గొన్నారు.
ఆలయ ప్రాంగణంలోని నూతన యాగశాల వద్ద అర్చక స్వామి రమాకాంత్ నేతృత్వంలో సాంప్రదాయబద్ధంగా చండీ హోమ కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు భక్తిశ్రద్ధలతో హోమంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హోమం అనంతరం భక్తులకు అమ్మవారి ప్రసాదంతో పాటు శేషవస్త్రాలను పంపిణీ చేశారు.
