AP | ఏపీ టూరిజం ఎండీ రవి సుభాష్‌కు మంత్రి దుర్గేష్‌ దిశానిర్దేశం..

ఏజెన్సీ, గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక పర్యాటక ప్రణాళికలు
ఎకో, వెల్‌నెస్‌ టూరిజానికి ప్రాధాన్యం..
పీపీపీ విధానంలో పెట్టుబడులకు ప్రోత్సాహం
ఆమోదం పొందిన ప్రాజెక్టులను వేగంగా పట్టాలెక్కించాలని సూచన


AP | (విజయవాడ, ఆంధ్రప్రభ) : రాష్ట్ర పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఏపీకి గుర్తింపు తీసుకురావాలని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ సూచించారు. ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) మేనేజింగ్‌ డైరెక్టర్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఐఏఎస్‌ అధికారి పట్టన్‌ శెట్టి రవి సుభాష్‌ బుధవారం సచివాలయంలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక రంగాభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై ఇరువురూ సుదీర్ఘంగా చర్చించారు.

నూతన ఎండీకి మంత్రి శుభాకాంక్షలు తెలిపి, పర్యాటక రంగాన్ని ముందంజలో నిలిపేందుకు క్షేత్రస్థాయిలో నిరంతరం కృషి చేయాలని సూచించారు. ముఖ్యంగా ఏజెన్సీ, గిరిజన ప్రాంతాల్లో పర్యాటక ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ప్రకృతి సమతుల్యతకు విఘాతం కలగకుండా ఎకో టూరిజంతో పాటు ఆరోగ్యం, ఆహ్లాదాన్ని అందించే వెల్‌నెస్‌ టూరిజం ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.

పీపీపీ విధానంలో పెట్టుబడులకు ప్రోత్సాహం కల్పించాలని, ఇప్పటికే కుదిరిన ఒప్పందాలు త్వరగా కార్యరూపం దాల్చేలా చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. నూతన పర్యాటక పాలసీ, అనుబంధ విధానాలపై సమగ్రంగా చర్చించారు. పర్యాటక రంగ నిపుణులు, పెట్టుబడిదారుల నుంచి వచ్చిన సూచనలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని తెలిపారు.

స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు, స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ కమిటీ పరిధిలో ఇప్పటివరకు ఆమోదం పొందిన పర్యాటక ప్రాజెక్టుల పురోగతిపైనా సమీక్షించారు. రాష్ట్ర పర్యాటక వైభవాన్ని చాటిచెప్పేలా ప్రాంతీయ పర్యాటక ఉత్సవాలు నిర్వహించడంతో పాటు దేశ, విదేశాల్లో ఏపీ టూరిజానికి విస్తృత ప్రచారం కల్పించాలని మంత్రి దుర్గేష్‌ సూచించారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా, మంత్రి దుర్గేష్‌ దిశానిర్దేశంతో రాష్ట్ర పర్యాటక రంగాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు కట్టుబడి పనిచేస్తానని ఏపీటీడీసీ ఎండీ పట్టన్‌ శెట్టి రవి సుభాష్‌ తెలిపారు.