Shamshabad |ఎయిర్‌పోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ష‌కీల్ అరెస్ట్ ..

హైదరాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో నేటి ఉద‌యం పోలీసులు అరెస్ట్ చేశారు. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న షకీల్‌పై గతంలో లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. కాగా గత కొన్ని నెలలుగా షకీల్ దుబాయ్‌లో ఉంటున్నారు. తల్లి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఇండియాకు వచ్చిన షకీల్ హైదరాబాద్ చేరుకోగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఆయనకు అనుమతించారు. ఆ తర్వాత షకీల్‌ను విచారించే అవకాశం ఉంది.

కాగా 2023లో ప్రజాభవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదానికి కారణమైన తన కుమారుడిని కేసు నుంచి తప్పించేందుకు తప్పుడు సాక్ష్యాలు క్రియేట్ చేశారని షకీల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన తర్వాత తన కుమారుడు రహేల్ దుబాయ్ పారిపోవడానికి షకీల్ సహకరించారని పోలీసులు తమ దర్యాప్తులో తేల్చారు. ఈ కేసులో షకీల్ ఏ3గా ఉన్నారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ పరారీలో ఉన్నారని హైదరాబాద్ పోలీసులు గతంలో వెల్లడించారు. దీంతో గత కొంత కాలంగా షకీల్ సైతం రాష్ట్రాన్ని వీడి దుబాయ్ లోనే మకాం వేశారు. ఈ క్రమంలో తాజాగా ఆయన తల్లి మరణించగా అంత్యక్రియల్లో పాల్గొనేందుకు షకీల్ ఇవాళ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అలర్ట్ అయిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *