స్వాతంత్ర్య వేడుకల్లో గ్రామ ప్రథమ పౌరురాలికి అవమానం
- ప్రజాప్రతినిధులను ఆహ్వానించకుండానే జెండా ఆవిష్కరణ
మెట్‌పల్లి రూరల్, ఆంధ్రప్ర: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో గ్రామ ప్రథమ పౌరురాలైన సర్పంచ్, ప్రజాప్రతినిధులను ఆహ్వానించకుండా ఆత్మనగర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఒక్కడే జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం మెట్‌పల్లి మండలంలో చర్చనీయాంశంగా మారింది. ఆత్మనగర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా సర్పంచ్, పాఠశాల కమిటీ చైర్మన్, ఇతర ప్రజాప్రతినిధులను ఆహ్వానించకుండా ప్రధానోపాధ్యాయుడు ఒక్కడే కొబ్బరికాయ కొట్టి జాతీయ జెండాను ఆవిష్కరించినట్లు స్థానికులు తెలిపారు.
ఈ ఘటన అక్కడి వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. జాతీయ పర్వదినాల సందర్భంగా గ్రామ సర్పంచ్, ప్రజాప్రతినిధులను గౌరవించి వారిని కార్యక్రమంలో భాగస్వాములను చేయడం కనీస బాధ్యత అని గ్రామస్తులు పేర్కొన్నారు. అయితే ఎవరినీ ఆహ్వానించకుండా ప్రధానోపాధ్యాయుడు ఒక్కడే జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి పాఠశాలల్లో జాతీయ పర్వదినాల సందర్భంగా పాటించాల్సిన నియమాలు, కార్యక్రమాల నిర్వహణపై స్పష్టత ఇవ్వాలని గ్రామస్తులు కోరుతున్నారు.
