AP Deputy CM | అభివృద్ధి బాటలో ఆంధ్రప్రదేశ్‌…

ప్రపంచానికి నాయకత్వం దిశగా భారత్‌


AP Deputy CM | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : బలమైన, సమర్థవంతమైన దేశంగా ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా భారత్‌ అడుగులు వేస్తోందని ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ అన్నారు. శనివారం కాకినాడలోని పోలీసు పరేడ్‌ మైదానంలో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆయన త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.

అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన పవన్ కల్యాణ్‌ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. “ఒక తరం స్వాతంత్ర్యం కోసం పోరాడింది.. మరో తరం ఆ స్వాతంత్ర్యాన్ని కాపాడింది” అని పేర్కొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, దేశం కోసం వారు చేసిన పోరాటాన్ని స్మరించుకున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్‌ అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు సాగుతోందని పవన్ కల్యాణ్‌ అన్నారు. వికసిత్‌ భారత్‌ సంకల్పంలో ఆంధ్రప్రదేశ్‌ తనదైన కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు.

రాజధాని అమరావతితో పాటు, పిఠాపురం నియోజకవర్గాన్ని రూ. 1,000 కోట్ల భారీ నిధులతో సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛను ఇతరులను దూషించడానికి, కించపరచడానికి ఉపయోగించవద్దని ఆయన హితవు పలికారు.

దేశాభివృద్ధిలో యువత, విద్యార్థులు కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని సూచించారు. రాష్ట్ర ప్రగతికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం కూడా ముఖ్యమన్నారు. ఈ కార్యక్రమానికి ఉన్నతాధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు, పోలీసు సిబ్బంది, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పరేడ్‌ మైదానం జాతీయ జెండాలతో, దేశభక్తి నినాదాలతో సందడిగా మారింది.