విద్యార్థులకు ఆర్థిక చేయూత
రూ.3 వేల చొప్పున ఉపకార వేతనాలు
చదువుకు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకి కాకూడదు: సర్పంచ్ వెంకటేష్
కెనరా బ్యాంకు సేవలను అభినందించిన సర్పంచ్
ఊట్కూర్, ఆంధ్రప్రభ : విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులను అధిగమించి ఉన్నత విద్యను కొనసాగించాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న విద్యాజ్యోతి పథకం ద్వారా ఉపకార వేతనాలు అందించడం అభినందనీయమని పెద్దజట్రం సర్పంచ్ వాకిటి వెంకటేష్ అన్నారు.
శనివారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని పెద్దజట్రం ఉన్నత, ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు కెనరా బ్యాంకు ఆధ్వర్యంలో విద్యాజ్యోతి పథకం కింద ఉపకార వేతనాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ వాకిటి వెంకటేష్, బ్యాంకు మేనేజర్ సాయి వంశీకృష్ణ మాట్లాడుతూ విద్యార్థుల చదువుకు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారకుండా బ్యాంకులు, స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకు వచ్చి సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు ప్రభుత్వం, బ్యాంకులు అందిస్తున్న విద్యా సహాయాన్ని సద్వినియోగం చేసుకుని కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.
విద్యార్థుల విద్యాభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తున్న కెనరా బ్యాంకు అధికారులను సర్పంచ్ అభినందించారు. విద్యార్థులను ప్రోత్సహించడంలో భాగంగా విద్యాజ్యోతి పథకం కింద ఒక్కో విద్యార్థికి రూ.3 వేల చొప్పున ఉపకార వేతనాలు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రతిభ ఉన్న విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహం కల్పించడం ద్వారా వారి చదువుకు మరింత తోడ్పాటు అందుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుతూ తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆశయాలను నెరవేర్చాలని కోరారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గౌరమ్మ, తమప్ప, పంచాయతీ కార్యదర్శి భవిత తదితరులు పాల్గొన్నారు.
