స్వాతంత్య్ర దినోత్సవాన కదం తొక్కిన ఎన్‌సీసీ క్యాడెట్లు

దేశ గౌరవాన్ని, జాతీయ భావాన్ని చాటుతూ ర్యాలీలు

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నేషనల్ క్రెడిట్ కార్ప్స్ (ఎన్‌సీసీ) క్యాడెట్లు కదం తొక్కారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలకు, కళాశాలల్లో తమ ప్రతిభను చాటుతూ ర్యాలీలు నిర్వహించారు. దేశ గౌరవాన్ని, జాతీయ భావాన్ని చాటుతూ జెండా పండగను ఘనంగా నిర్వహించారు. రాజధాని నగరం హైదరాబాద్ లోని వేలాది పాఠశాలల్లో శనివారం ఉదయం 7 గంటల నుంచి ’తిరంగా ర్యాలీ’ లు నిర్వహించి స్వతంత్య్ర భారత గౌరవాన్ని చాటి చెప్పారు.

మెహదీపట్నంలోని పుల్లారెడ్డి పాఠశాలలో విశ్వ హిందూ పరిషత్ (విహెచ్ పి) అంతర్జాతీయ అధ్యక్షుడు జి. రాఘవరెడ్డి ఆధ్వర్యంలో ఎన్‌సీసీ క్యాడెట్ల ర్యాలీతో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా, వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ, ఎంతోమంది కష్టఫలమే స్వాతంత్రం అని అలాంటి స్వాతంత్రం భారతదేశంలో సాధించి 80 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం సంతోషమైన విషయమని అన్నారు.

ఈ 80 ఏళ్లలో భారతదేశం అనేక రంగాలలో ముందుకు వెళ్లిందని నేడు ప్రపంచ దేశాలలో అగ్రదేశాలతో పోటీగా భారతదేశం ఉండడం ప్రపంచ దేశాలకు భారతదేశ మార్గదర్శకంగా ఉండడం భారత దేశ ప్రజలకు గర్వకారణమని ఆమె స్పష్టం చేశారు. స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా భారతదేశంలో ప్రతి ఒక్కరూ దేశ అభ్యున్నతికి తోడ్పడే విధంగా ఉండాలని ముఖ్యంగా యువత దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పెరగాలని దేశ భవిష్యత్తుకు అభ్యున్నతిని తీసుకువచ్చే విధంగా యువత ముందుకు నడవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎన్‌సీసీ ఉన్నతాధికారులు సబేదార్ మేజర్ విజయ్ కుమార్, పుల్లారెడ్డి విద్యా సంస్థల కార్యదర్శి జి.ప్రీతి రెడ్డి, ప్రిన్సిపల్ పాలెం సంగీత, సీటీఓ సదానందే సంజన తదితరులు పాల్గొన్నారు.