ప్రజా ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం
- రీఓపెన్ కు అవకాశం ఇవ్వొద్దు
- కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ
- తూర్పులో నాలుగో విడత ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమం
- నాలుగు విడతల్లో మొత్తం 378 అర్జీల స్వీకరణ
- ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులను అభినందించిన ఎమ్మెల్యే గద్దె
పటమట,ఆంధ్రప్రభ: ప్రజల నుంచి అందుతున్న ప్రతి ఫిర్యాదును అత్యంత బాధ్యతతో పరిశీలించి, మళ్లీ రీ-ఓపెన్ అయ్యే పరిస్థితి లేకుండా అర్థవంతమైన, శాశ్వత పరిష్కారం చూపాలి. అపరిష్కృత సమస్యల పరిష్కారానికే ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం” అని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. ‘ఒక నెల–ఒక నియోజకవర్గం–నాలుగు సందర్శనలు’ కార్యక్రమంలో భాగంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో నాలుగో విడత ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని శుక్రవారం పటమట ఎన్ఎస్ఎం పబ్లిక్ స్కూల్ రోడ్డులోని నల్లూరివారి కల్యాణ మండపంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్రావు, జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ ప్రజల నుంచి వినతులను స్వీకరించి సంబంధిత అధికారులతో సమస్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జూలై 3, 10, 17 తేదీల్లో నిర్వహించిన మూడు విడతల ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమాల్లో 241 అర్జీలు స్వీకరించగా, నాలుగో విడతలో మరో 137 అర్జీలు అందాయని తెలిపారు. దీంతో నాలుగు విడతల్లో మొత్తం 378 అర్జీలు స్వీకరించినట్లు వెల్లడించారు.
ప్రతి అర్జీని సంబంధిత శాఖ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, అవసరమైతే క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని సూచించారు. ఫిర్యాదులు మళ్లీ రీ-ఓపెన్ కాకుండా నాణ్యమైన పరిష్కారాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్రావు మాట్లాడుతూ, ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమాల ద్వారా తూర్పు నియోజకవర్గంలోని అనేక సమస్యలు పరిష్కారమయ్యాయని తెలిపారు.
ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరిస్తున్న అధికారులను అభినందించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా త్వరలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమాలు ప్రజలకు తక్షణ పరిష్కారాలు అందించే సమర్థవంతమైన వేదికగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఆర్డీవో వెన్నెల శ్రీను, పీజీఆర్ఎస్ నోడల్ అధికారి జి. జ్యోతి, వీఎంసీ జోనల్ కమిషనర్ ప్రభు కుమార్, అడిషనల్ కమిషనర్ శకుంతల, వివిధ శాఖల జిల్లా అధికారులు, వీఎంసీ సిబ్బంది, వార్డు అధికారులు పాల్గొన్నారు.
