బాధిత కుటుంబాలకు ఆర్థిక భరోసా…
రోడ్డు ప్రమాదంలో మరణించిన కార్యకర్తల కుటుంబాలకి రూ. 5 లక్షల భీమా చెక్కులను అందజేసిన పెడన ఎమ్మెల్యే
బంటుమిల్లి – ఆంధ్రప్రభ : బంటుమిల్లి మండలం, చిన్నతుమ్మిడి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాగిత అమలేశ్వరరావు వేముల శివయ్య గారు ఇటీవల జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వారు పార్టీ సభ్యత్వం తీసుకున్నందున, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి నుండి రూ.5,00,000లు ప్రమాద భీమా నగదు మంజూరైంది.
ఈ భీమా నగదు చెక్కులను పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ వారి కుటుంబ సభ్యులకు స్వయంగా అందజేశారు. అదేవిధంగా ప్రముఖ వ్యాపారవేత్త త్రివిక్రమ్ పెడన సభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ చేతుల మీదుగా కాగిత అమరేశ్వరరావు గారి కుటుంబానికి లక్ష రూపాయలు, వేముల శివయ్య గారి కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ…. పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తల సంక్షేమమే పరమావధిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరియు యువ నాయకులు నారా లోకేష్ ఈ సంక్షేమ నిధిని ఏర్పాటు చేశారని, ప్రమాదవశాత్తు ఏ కార్యకర్త అయినా మరణిస్తే, వారి కుటుంబాలు ఆర్థికంగా రోడ్డున పడకుండా కొండంత అండగా నిలవడమే ఈ సంక్షేమ నిధి ముఖ్య ఉద్దేశమన్నారు. కాగిత అమలేశ్వరరావు గారు వేముల శివయ్య గారి కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ మరియు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటామని, భవిష్యత్తులో ఎలాంటి అవసరం వచ్చినా ఆదుకుంటామని ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ భరోసా ఇచ్చారు.
