కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలపై గళమెత్తిన రైతులు, కార్మికులు…

క్విట్ ఇండియా స్ఫూర్తితో క్విట్ కార్పొరేట్స్ అంటూ ఏలూరులో జైల్ భరో..
మండుటెండలో ఫైర్ స్టేషన్ సెంటర్ లో రాస్తారోకో.. అరెస్టులు చేసిన పోలీసులు..
అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఉపసంహరించుకోవాలి.
కార్పొరేట్ కంపెనీల లూటీ ఆపకపోతే ప్రజా ప్రతిఘటన తప్పదు.
రైతు, కార్మిక, రైతు-కూలీ, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు హెచ్చరిక..


ఏలూరు, ఆగస్టు 10 (ఆంధ్రప్రభ) : మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై రైతులు, కార్మికులు గళమెత్తారు. సంయుక్త కిసాన్ మోర్చా- కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక ఇచ్చిన పిలుపులో భాగంగా క్విట్ ఇండియా స్ఫూర్తితో క్విట్ కార్పొరేట్ నినాదంతో ఏలూరులో జైల్ భరో కార్యక్రమం నిర్వహించారు. మండుటెండలో ఫైర్ స్టేషన్ లో రాస్తారోకో చేపట్టారు. 151 ప్రకారం అరెస్టులు చేసి కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక, రైతు -కూలీ సంఘాల నాయకులను, కార్యకర్తలను టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డి ఎన్ వి డి ప్రసాద్, ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి పోరండ్ల శ్రీనివాస్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డి శ్రీనివాస డాంగే, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా నాయకులు రాజనాల రామ్మోహనరావు, ఐ ఎఫ్ టి యు నగర కార్యదర్శి ఎర్ర శ్రీనివాస్, రైతు-కూలీ సంఘం (ఆం.ప్ర) జిల్లా కార్యదర్శి ఎస్.కె.భాషా, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ మాట్లాడారు.

కేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీల అనుకూల విధానాలు అనుసరిస్తోందని, కార్మిక, రైతాంగ హక్కులను హరించి వేస్తోందని తీవ్రంగా విమర్శించారు. నాడు బ్రిటిష్ దోపిడీకి వ్యతిరేకంగా క్విట్ ఇండియా ఉద్యమం జరిగిందని, నేడు దేశాన్ని లూటీ చేస్తున్న క్విట్ కార్పొరేట్స్ ఉద్యమం జరుగుతున్నదని చెప్పారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్పొరేట్లకు, అమెరికా సామ్రాజ్యవాదులకు లొంగిపోయిందని, అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకుంటున్నదని అన్నారు. మన వ్యవసాయాన్ని సర్వనాశనం చేసే ఈ ఒప్పందాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.రైతులు కష్టపడి పండించిన పంటలకు మద్దతు ధరలు కల్పించేలా మద్దతు ధర గ్యారంటీ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. రైతుల రుణాలు మాఫీ చేయాలని కోరారు.

కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలన్నారు. కార్మికులకు కనీస వేతనాన్ని పెంచాలన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం పునరుద్ధరణ చేసి సంవత్సరానికి 200 రోజులు పని దినాలు, రోజుకు రూ.700 కనీస వేతనం అమలు చేయాలన్నారు. సార్వత్రిక సామాజిక భద్రత పింఛను నెలకు రూ.10 వేలు ఇవ్వాలన్నారు. విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లు-2025, విత్తన బిల్లు-2025, ఎన్.ఎఫ్.ఎస్. ఏ సవరణ బిల్లులను వెనక్కి తీసుకోవాలన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.25 లక్షలు చొప్పున పరిహారం అందజేయాలన్నారు. బలవంతపు భూసేకరణ ఆపాలని కోరారు. పెంచిన ఎరువులు, పెట్రోల్, డీజిల్,గ్యాస్,ఇతర సరుకులు ధరలు తగ్గించాలని, సబ్సిడీలను పునరుద్ధరణ చేయాలని కోరారు. ప్రజా వ్యతిరేక విధానాలు మానుకోకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రాస్తారోకో చేస్తున్న సమయంలో టూ టౌన్ సి.ఐ అశోక్ కుమార్ నేతృత్వంలో అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ తరలించి అనంతరం విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్ట భాస్కరరావు, జిల్లా ఉపాధ్యక్షులు కోన శ్రీనివాసరావు,సిరిబత్తుల సీతారామయ్య, ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు కట్టా నాగేశ్వరరావు, సిఐటియు నాయకులు నారపల్లి రమణారావు,కె. శ్రీనివాసరావు, పంపన రవికుమార్,గొట్టాపు రవి కిషోర్, వైయస్ కనకారావు,వివిఎన్ ప్రసాద్, ఏఐటీయూసీ ఏరియా కార్యదర్శి ఏ అప్పలరాజు, జిల్లా నాయకులు పుప్పాల కన్నబాబు,డి లక్ష్మణమూర్తి బరగడ పోతురాజు, బి కే యం యు నాయకులు పొట్టేలు పెంటయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు ఎస్.మహంకాళిరావు, జి. సత్యనారాయణ, డి. నాగేంద్ర,కాంగ్రెస్ కిసాన్ సెల్ నాయకులు సాదే బాబు ప్రసాద్, సుంకర వెంకట సుబ్బారావు, పి ఓ డబ్ల్యు జిల్లా అధ్యక్షురాలు కుర్సం లత తదితరులు పాల్గొన్నారు.