Exclusive | రామయ్యా .. రైలేదయ్యా! ఇప్పటికే జీవిత కాలం లేటు

ప్రాజెక్టు పట్టాలెక్కేది ఎప్పుడు..
రైలుకూత వినపడేది ఎన్నడు
0మరో ఐదేళ్లు ఆలస్యమంటున్న సర్కారు
కొవ్వూరు వైపు సత్తుపల్లి చూపు..
ఎటపాకలోనేమో పడిగాపులు
ఒడిశా రైలు ఎప్పుడు వచ్చేనో..
దీనంగా ఎదురుచూస్తున్న భక్తజనం
₹5000 కోట్లతో ప్రసాదం.. ఊరిస్తున్న కేంద్రం
అప్పుడే పెరిగిన రియల్ భూమ్..
ఖుషీఖుషీ అవుతున్న రియలర్టర్లు
కారుచౌకగా రైలులో భద్రాద్రి చేరాలంటే.. దారి లేదు. తెన్నూలేదు. 56 ఏళ్లుగా కొత్తగూడెంలో భద్రాచలం రోడ్డు రైల్వే స్టేషన్ దీనంగా భక్తుల వైపు చూస్తోంది. ఇటు జీవిత కాలం లేటులో ఉత్తరాది రైలు కనపడటం లేదు. మరో వైపు తాజాగా గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ అంటోంది. ₹4600 కోట్లతో ఈ హైవే పనులు పూర్తవుతున్నాయి. హైదరాబాద్ నుంచి విశాఖకు అతి వేగంగా బస్సులు, కార్లు పరుగులు తీస్తాయి. కానీ భద్రాచలం రోడ్డు నుంచి కొవ్వూరుకు వెళ్లే రైలుకు దిక్కూ మొక్కూ లేదు. సత్తుపల్లి నుంచి కొవ్వూరు వరకూ కేవలం ₹2100 కోట్లతో ఈ మార్గాన్ని నిర్మించటానికి రైల్వే శాఖ తల్లకిందులవుతోంది. మరో ఐదేళ్లల్లో భద్రాచలం ఫ్లాట్ ఫారంపైకి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ వస్తోందని కేంద్ర మంద్రి ఎనౌన్స్ చేశారు. ఇది సరే ₹2,800 కోట్లతో ఒడిశా మల్కన్ గిరి టూ భద్రాచలం రైలు మార్గాన్నీ నిర్మిస్తున్నామని ఊరించారు. ఇంతకీ రైలు మార్గాలు తెరచేది ఎప్పుడు.. రైలు వచ్చేది ఎప్పుడో.. ఇవీ రామ భక్త జనం గుండెల్లోని ప్రశ్నలు.
సెంట్రల్ డెస్క్, ఆంధ్రప్రభ – అరవై అయిదేళ్లుగా.. కొవ్వూరు, భద్రాచలం రోడ్డు రైలు మార్గం.. రామభక్తులను ఊరిస్తోంది. ఆశలు రేపుతోంది. ఆ తరువాత తూచ్ అంటోంది. అందుకే ఇరవై ఏళ్లుగా పోరాడిన ఉద్యమకారులూ ఈ రైలు మార్గం ఇక లేదని గప్ చిప్ అయ్యారు. కానీ ఇటీవల లోక్‌సభలో బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అడిగిన ఒక ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. రూ.2,155 కోట్ల అంచనా వ్యయంతో పనులు ప్రారంభిస్తామని, రాబోయే అయిదేళ్లల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు అనుసంధాన కొవ్వూరు-,, భద్రాచలం రైలు మార్గానికి కేంద్ర మంత్రి పచ్చా జెండా ఊపారు.
ఈ మేరకు కేంద్రం తగినంత బడ్జెట్ కేటాయించింది. చిన్న, చిన్న మార్పులతోనే ఈ రైల్వే మార్గం పూర్తి చేసేందుకు రంగం సిద్ధమైంది. రాబోయే ఐదేళ్లల్లోనే ఈ లైన్‌ను ఈ ప్రాజెక్టును పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. కొవ్వూరు- భద్రాచలం లైన్‌లో ఏజెన్సీ మీదుగా సాగే ఈ రైల్వే మార్గం పూర్తయితే దూరాభారం తగ్గుతుంది. కొవ్వూరు- భద్రాచలం రైలు మార్గానికి వీలుగా రూ.2,155 కోట్లు మంజూరు చేస్తున్నట్టు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ రైల్వే మార్గాన్ని 165 కిలోమీటర్ల నుంచి 119 కిలోమీటర్లకు తగ్గింది.. కొంత అలైన్‌మెంట్‌లో మార్పులు, చేర్పులు చేసి సత్తుపల్లి-దేవరపల్లి వరకు ఇప్పటికే గ్రీన్‌హైవే నిర్మిస్తున్నందున దానికి సమాంతరంగా కొత్త రైల్వే లైనుకు లైన్ క్లియర్ అయినట్లే అంటున్నారు. ఇప్పుడు ఈ రైల్వే లైన్ టి.నర్సాపురం, పుట్టగట్ల గూడెం మీదుగా ఈ రైల్వే లైను వెళ్లబోతోంది.
65 ఏళ్లుగా ఎన్నో బ్రేకులు.. క్రాసింగ్ లు
కొవ్వూరు-భద్రాచలం రైల్వే లైను నిర్మాణం కోసం 1960లో తొలి సారిగా సర్వే జరిగింది.. అంటే దాదాపు 65 ఏళ్ల ప్రజల కల. ఈ మార్గం ప్రాధాన్యతను అప్పుడే సర్వేలో నివేదించా రు. ఈ రైలు మార్గంలో రిజర్వ్ ఫారెస్టు ఎక్కువగా ఉండటంతో అటవీ, పర్యావరణ అనుమతులు కావాల్సిందే.. ఆతర్వాత ప్రతి బడ్జెట్‌లో ఈ రైల్వే లైను ప్రస్తావన వచ్చినా.. బడ్జెట్‌లో నయా పైసా కేటాయించలేదు. ఈ రైలు మార్గం కోసం గడిచిన పదేళ్లుగా కేవలం సర్వే, ఇతర పనుల నిమిత్తం రూ.40 కోట్లు కేటాయించారు. కానీ ఆ తర్వాత అడుగులు ముందుకు పడలేదు.. గతంలో పలు సందర్భాల్లో ఎంపీలంతా ఈ రైల్వే లైను కోసం పార్లమెంటులో ప్రస్తావించారు. రైల్వే మంత్రికి వినతి పత్రాలు అందజేశారు.. కానీ ఈ రైల్వే లైన్ పనులు ప్రారంభం కాలేదు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా సర్వేల పేరిట . కొవ్వూరు -భద్రాచలం రైల్వే లైన్ నిర్మాణం ఆలస్యమైంది. ఏకంగా 120 చోట్ల బ్రిడ్జిలను నిర్మించాలి. లా ఈ రైలు మార్గానికి కొన్ని సిగ్నల్ బ్రేకులు.. మరి కొత్త ప్రాజెక్టుల క్రాసింగులు తప్పలేదు. బొగ్గు రవాణాకు రైల్వే ట్రాక్ అవసరం కావటంతో భద్రాచలం ..సత్తుపల్లి మధ్య రైల్వే లైను నిర్మాణానికి సింగరేణి కాలరీస్ కంపెనీ రూ.990 కోట్లు అందించింది. మిగిలిన పనుల పూర్తికి అనేక సర్వేలు జరిగాయి కానీ పట్టాలెక్కలేదు.
కదులుతోంది.. రామరథం
ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న భద్రాచలం రోడ్డు (కొత్తగూడెం) -కొవ్వూరు రైల్వే లైన్ ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.2,155 కోట్ల అంచనా వ్యయంతో పనులు మంజూరు చేయడంతో త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో 50 శాతం కాస్ట్ షేరింగ్ ప్రాతిపదికన ప్రాజెక్టును మంజూరు చేశారు. రాజమండ్రి ఎంపి పురందేశ్వరి అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల లోక్‌సభలో ఈ రైల్వే ట్రాక్ నిర్మాణంపై లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 119 కి.మీ కొత్త రైల్వే లైన్ ప్రాజెక్ట్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో 50 శాతం కాస్ట్ షేరింగ్ ప్రాతిపదికన మంజూరు చేయబడిందని ఆయన పార్లమెంట్‌లో వెల్లడించారు. దీంతో ప్రాజెక్టుపై స్థానికుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. కాగా, భద్రాచలం రోడ్డు-కొవ్వూరు (ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా) రైల్వే లైను మొదటిసారిగా 1969..-70లో ప్రారంభించారు. ఈ సమయంలో లొకేషన్ సర్వే కూడా జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. 2009లో అప్పటి కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కే హెచ్ మునియప్ప లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా.. ప్రతిపాదిత బ్రాడ్‌గేజ్ లైన్ కోసం తుది లొకేషన్ సర్వే పూర్తయిందని చెప్పారు. 2012-..13లో రూ.1,445 కోట్లతో ప్రాజెక్టు మంజూరు చేశారు.
ఒకటి కాదు రెండు లైన్లతో ఊరింత
మరోవైపు కేంద్రం స్పెషల్ రైల్వే ప్రాజెక్టుగా ఒడిశాలోని మల్కన్గిరి, తెలంగాణలోని -పాండురంగాపురం మధ్య 173.6 కి.మీ బ్రాడ్గేజ్ రైల్వే లైన్ నిర్మాణానికి భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది. టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేసింది.రైల్వే భూ సేకరణ చట్టం –2008 ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు భూములను సేకరించనుంది. తెలంగాణలో 19.7 కి.మీ, ఏపీలో 85.5 కి.మీ, ఒడిశాలో 68.3 కి.మీ మేర రైల్వే ట్రాక్నిర్మిస్తారు. ప్రాజెక్టును 2030 నాటికి పూర్తి చేస్తామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్లోక్సభలో ప్రకటించారు. ఇలా భద్రాచలంలో టెంపుల్టూరిజం అభివృద్ధికి రామరథం కదిలింది. ఈ మార్గంలో మిగిలిన రైల్వే లైను నిర్మాణానికి రూ.2,154.83 కోట్లు కేంద్రం కేటాయించింది. ఇప్పటికే ప్రసాద్ స్కీమ్ కింద తొలివిడత రూ.41 కోట్లు కేటాయించింది. ఇందులో రూ.22 కోట్లతో భద్రాచలం ఆలయం, పర్ణశాలలో పనులు చేపట్టారు. భూసేకరణకు రాష్ట్ర సర్కారు కూడా రూ.60.20 కోట్లు కేటాయించింది. రెండు రైల్వే లైన్ల తో భద్రాచలం ఆలయానికి దేశ నలుమూలల నుంచి భక్తులు, పర్యాటకులు ఊరట లభించినట్టే. ఇక టెంపుల్ టూరిజం అభివృద్ధికి ఆ ప్రాజెక్టులు వచ్చే పదేండ్లలో భద్రాచలం రూపురేఖలను మార్చివేస్తాయంటే అతిశయోక్తి కాదు. .
భద్రాద్రి పట్టాలెక్కితే…
విశాఖపట్నం, కాకినాడ ఓడరేవుల నుంచి సికింద్రాబాద్, నాగ్‌పూర్ వైపు సరకుల రవాణాకు ఈ రైల్వే లైన్ ఎంతో ఉపయుక్తం, తెలంగాణకు పోర్టు కనెక్టివిటీ పెరుగుతుంది. జనానికి ప్యాసింజర్ రైళ్లు అందుబాటులోకి వస్తాయి. ఏపీ, తెలంగాణల్లో 200 మారుమూల గిరిజన గ్రామాలకు రైలు సదుపాయం లభిస్తుంది. ఇది హైదరాబాద్, విశాఖపట్నం మధ్య 150 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. రెండు గంటల సమయం కలిసొస్తుంది. ఈ రైలు మార్గంతో తెలంగాణకు కనెక్టివిటీ పెరగనుంది.. సత్తుపల్లి ప్రాంతంలో బొగ్గు నిక్షేపాలు బయటపడటంతో.. అక్కడి బొగ్గును ఇతర ప్రాంతాలకు తరలించాలంటే రైలు మార్గం అత్యవసరం. కొత్తగూడెం -సత్తుపల్లి మధ్య కాస్ట్ టూ కాస్ట్ షేరింగ్ పద్ధతిలో సింగరేణి యాజమాన్యం కొంత ఖర్చు భరించగా.. సౌత్ సెంట్రల్ రైల్వే తన వాటాను ఖర్చు చేశారు. తాజాగా కొవ్వూరు -సత్తుపల్లి మధ్య రైల్వేలైను నిర్మిస్తే కొంత ప్రతి పాదిత వ్యయం తగ్గడమే కాకుండా రాబోయే ఐదేళ్లల్లోనే పనులు పూర్తి చేయడానికి అవకాశం ఏర్పడుతుంది.
ఫలించిన.. 40 ఏళ్ల ఆందోళన
1964లో ఈ లైన్ నిర్మాణానికి బీజం పడింది. కానీ.. ఇప్పటి వరకు ప్రకటనలకే పరిమితమైంది . కొత్తగూడెం -కొవ్వూరు రైల్వేలైన్ నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా.. 1984లో కొవ్వూరు రైల్వేలైన్ సాధన కమిటీ ఏర్పడింది. పాండురంగాచార్యులు అధ్యక్షతన ఈ కమిటీ ఆధ్వర్యంలో.. నిరసన కార్యక్రమాలు చేపట్టారు. చంద్రుగొండ, అశ్వారావుపేట, సత్తుపల్లి, జంగారెడ్డిగూడెం, కొవ్వూరు ప్రాంతాలకు ఈ కమిటీని విస్తరించారు. 2014 జనవరిలో 22 రోజుల పాటు కొత్తగూడెం నుంచి కొవ్వూరు వరకు పాదయాత్ర నిర్వహించారు. సింగరేణి సంస్థ, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇప్పటికే కొత్తగూడెం నుంచి సత్తుపల్లి వరకు 56.25కి.మీ. రైల్వేలైన్ పూర్తయ్యింది. సత్తుపల్లి నుంచి కొవ్వూరు వరకు మరో 95కి.మీ. లైన్ నిర్మిస్తే సరిపోతుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ రైల్వేలైన్ కోసం నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించటంతో.. ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
భద్రాద్రి రియల్టర్లలో ఖుషీ ఖుషీ
భద్రాద్రిపై రియల్టర్ల ఫోకస్ ..రైల్వే ప్రాజెక్టులు, ఆలయ అభివృద్ధి పనులకు రూపకల్పన జరగడంతో రాష్ట్రంలోని రియల్టర్ల ఫోకస్ భద్రాచలంపై పడింది. ఇప్పటికే ఆంధ్రాలో విలీన పంచాయతీలు ఏటపాక, పిచ్చుకులపాడు, గుండాల, కన్నాయిగూడెం, పురుషోత్తపట్నంలో భూములు కొనేందుకు పోటీ పడుతున్నారు. ఏటపాక మండలం చెన్నంపేట శివారు నుంచి రైల్వే లైను, బూర్గంపాడు మండలం మోతెగడ్డ ద్వీపం మీదుగా బ్రిడ్జి ద్వారా పాండురంగాపురానికి వెళ్తుంది. దీంతో బూర్గంపాడు మండలం సారపాక, మోతె ప్రాంతాల్లో కూడా భూముల ధరలకు రెక్కలొస్తున్నాయి.
ఇక భద్రాచలంలో సైతం ఖాళీ భూముల కొనుగోళ్లలో వేగం పెరిగింది. నిన్న, మొన్నటి వరకు పోలవరం బ్యాక్ వాటర్, రాష్ట్ర విభజన కారణంగా డీలా పడ్డ రియల్ఎస్టేట్మళ్లీ పుంజుకుంటోంది. టూరిస్టులు పెరిగే అవకాశాలు భద్రాచలం, కిన్నెరసాని, తుమ్మలచెరువు, పూబెల్లి, బెండాలపాడు, బొజ్జిగుప్ప, నారాయణరావుపేటను ఎకో టూరిజంగా డెవలప్ చేసేందుకు జిల్లా కలెక్టర్చొరవ చూపుతుండగా..ఆయా ప్రాంతాలకు పర్యాటకులు ఎక్కువగా వస్తారు. దీంతో జిల్లాలో పర్యాటకం జోరందుకోనుంది. భద్రాద్రి టెంపుల్చుట్టూ ఉన్న టూరిజం స్పాట్లతో పాటు పాపికొండలు, గోదావరి విహారయాత్రకు డిమాండ్అధికంగా ఉంటుంది. రైలు సౌకర్యం ఉంటే టూరిస్టులు మరింత పెరుగుతారు. దీంతో అభివృద్ధికి బాటలు పడతాయి.పర్యాటకంగా అభివృద్ధిజిల్లాలో టూరిజం డెవలప్ మెంట్ కు చాలా అవకాశాలు ఉన్నాయి. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తే గిరిజన స్థితిగతులు మారిపోతాయి. వారు స్వయం ఉపాధి పొందుతారు. తద్వారా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మరోవైపు అన్ని రంగాల్లో జిల్లా అభివృద్ధి చెందుతుంది. రాబోయే రోజుల్లో కొత్తగూడెం జిల్లాలోని గిరిజన ప్రాంతాలకు అధిక ప్రాధాన్యత పెరుగుతుంది.
