భూపాలపల్లిలో మతసామరస్యానికి నిదర్శనం

భూపాలపల్లిలో మతసామరస్యానికి నిదర్శనం
- ఎస్ఐ తాజుద్దీన్ సేవాభావం ప్రశంసనీయం
- కులమతాలకు అతీతంగా భోజన కార్యక్రమం
భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ ; భూపాలపల్లి పట్టణంలోని రామాలయంలో శనివారం భక్తి, సామరస్యానికి ప్రతీకగా ఒక విశిష్ట కార్యక్రమం జరిగింది. హనుమాన్ మాలాధారణలో ఉన్న 141 మంది స్వాములకు పస్రా పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ తాజుద్దీన్ భిక్ష (భోజన) కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం కులమతాలకు అతీతంగా నిర్వహించడం విశేషంగా నిలిచింది. ఉదయం నుంచే ఆలయ ప్రాంగణం భక్తులతో కళకళలాడగా, మాలాధారణ స్వాములకు ప్రత్యేకంగా సిద్ధం చేసిన ప్రసాదాన్ని ప్రేమతో వడ్డించారు.

తాజుద్దీన్ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించి, భోజనం అందించే కార్యక్రమంలో పాల్గొనడం అందరి ప్రశంసలను అందుకుంది. ఈ సందర్భంగా స్వాములు మాట్లాడుతూ.. ఇలాంటి సేవా కార్యక్రమాలు సామాజిక ఐక్యతను బలపరుస్తాయని, మతసామరస్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. కులమత భేదాలు లేకుండా అందరికీ సమానంగా సేవ చేయడం గొప్ప విషయం అని తెలిపారు. కార్యక్రమం అనంతరం స్వాములు అందరూ ఆనందం వ్యక్తం చేస్తూ తాజుద్దీన్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ భిక్ష కార్యక్రమం స్థానిక ప్రజలలో సానుకూల స్పందనను రేకెత్తించగా, భక్తి, సేవా భావం, మానవతా విలువలు ఎంత ముఖ్యమో మరోసారి చాటి చెప్పింది.
