తవ్వకాలలో వెలుగుచూసిన పురాతన వీరగల్లు..
దిలావర్పూర్, ఆంధ్రప్రభ : దిలావర్పూర్ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన తవ్వకాల సందర్భంగా పురాతన వీరగల్లు శిలా విగ్రహం వెలుగుచూడడం స్థానికంగా ఆసక్తిని రేకెత్తించింది. గ్రామానికి చెందిన నడుకుడా పోశెట్టి ఇంటి సమీపంలోని తోట బావిలో జేసీబీతో తవ్వకాలు చేపట్టగా ఈ పురాతన శిలా విగ్రహం బయటపడింది. బావిలో పురాతన విగ్రహం ఉందన్న స్థానికుల సమాచారంతో దానిని వెలికితీసేందుకు గ్రామ ఉపసర్పంచ్ నడుకుడా సుఖేష్ ఆధ్వర్యంలో తవ్వకాలు చేపట్టారు. ఈ క్రమంలో వీరగల్లు శిలా విగ్రహం వెలుగుచూసింది.
విగ్రహాన్ని పరిశీలించిన గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయులు నంద అనిల్, అన్వేష్ రెడ్డి, పసుల పవన్ మాట్లాడుతూ, ఇది కొన్ని వందల సంవత్సరాల నాటి మహావీరునికి సంబంధించిన వీరగల్లు విగ్రహంగా భావిస్తున్నట్లు తెలిపారు. దీనిపై పురావస్తు శాఖ అధికారులకు సమాచారం అందించి శాస్త్రీయంగా పరిశీలించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అదే ప్రాంతంలో మరిన్ని పురాతన శిల్పాలు లేదా చారిత్రక ఆనవాళ్లు వెలుగుచూసే అవకాశముందని వారు అభిప్రాయపడ్డారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని పురాతన వీరగల్లును ఆసక్తిగా పరిశీలించారు.
