వర్షాకాలంలో పరిశుభ్రతే ఆరోగ్యానికి బాట..
వర్షాకాలంలో పరిశుభ్రతే ఆరోగ్యానికి బాట..
- మండలంలో గ్రామ సభ నిర్వహణ
- తడి చెత్త, పొడి చెత్త నిర్వహణపై అవగాహన
- ఎంపీడీవో నాగేష్
తిర్యాణి, ఆంధ్రప్రభ ; మండలంలోని గ్రామపంచాయతీలల్లో శనివారం గ్రామ సభను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల పంచాయతీ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) నాగేష్, ఎంపీఓ ప్రశాంత్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గ్రామ ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టడమే లక్ష్యంగా ఈ గ్రామ సభ నిర్వహించారు. ముందుగా సర్పంచ్ ఎదుల సుమలత మాట్లాడుతూ గ్రామంలో నెలకొన్న తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, విద్యుత్ తదితర సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గ్రామాభివృద్ధికి అధికారులు సహకరించాలని కోరారు.

ఉపసర్పంచ్ పవన్ కుమార్ కూడా గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో నాగేష్ మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో గ్రామ ప్రజలు పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ముఖ్యంగా తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి నిర్వహించడం వల్ల గ్రామంలో పారిశుద్ధ్యం మెరుగుపడటంతో పాటు వ్యాధులు వ్యాపించకుండా నివారించవచ్చని తెలిపారు. ఇంటి పరిసరాల్లో నీరు
నిల్వ ఉండకుండా చూసుకోవాలని, దోమల నివారణకు ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలని సూచించారు. “మీ గ్రామాన్ని మీరే కాపాడుకోవాలి” అనే సందేశంతో ప్రజల్లో అవగాహన కల్పించిన ఎంపీడీవో, గ్రామ పరిశుభ్రత బాధ్యత కేవలం అధికారులదే కాకుండా ప్రతి గ్రామస్తుడిదని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న స్వచ్ఛత కార్యక్రమాలను విజయవంతం చేయడంలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. అనంతరం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణపై గ్రామ సభలో తీర్మానం చేశారు.
ప్రకృతిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ ప్రతి ఇంటి వద్ద కనీసం ఒక మొక్క నాటాలని నిర్ణయించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు కలిసి మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను చాటి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ శాఖ ‘ గ్రామ కార్యదర్శి సాయి కృష్ణ, సర్పంచ్ ఎదుల సుమలత, ఉపసర్పంచ్ పవన్ కుమార్, ఏఈఓ ముత్తయ్య, క్రాంతి, ఎంఆర్వో కార్యాలయ ఆర్ఐ, అంగన్వాడీ సూపర్వైజర్ సరోజ, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, మహిళలు, యువకులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
