Election | తరలివస్తున్న ఓటర్లు..

Election | తరలివస్తున్న ఓటర్లు..
Election, మక్తల్, ఆంధ్రప్రభ : మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మక్తల్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఎన్నికల సందడి కనిపిస్తుంది. పోలింగ్ కేంద్రాల వద్ద అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు తమ మద్దతుదారులకు ప్రచారం చేస్తున్నారు. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు వేసి వెళ్తున్నారు. వివిధ ప్రాంతాలకు ఉపాధి నిమిత్తం వలస వెళ్లిన వారు ప్రత్యేక వాహనాలలో తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. నియోజకవర్గంలోని మక్తల్ మండలం సంగంబండ గ్రామానికి ముంబాయి నుంచి 2 డిఎసిఎం వాహనాల్లో 150 మంది ఓటర్లు తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
సంగంబండ పోలింగ్ కేంద్రంలో మక్తల్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గవినోళ్ళ రాధా మాజీ జడ్పీటీసీ లక్ష్మారెడ్డి దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదే విధంగా గడ్డంపల్లి పంచాయతీ పోలింగ్ కేంద్రంలో మాజీ ఎంపీపీ గడ్డంపల్లి హన్మంతు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సత్వవార్ పోలింగ్ కేంద్రంలో మాజీ వైస్ ఎంపిపి రామేశ్వరమ్మ ఓటు వేశారు. అలాగే సర్పంచ్ అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ సరళి ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

