నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం హర్షణీయం
నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం హర్షణీయం
- రాష్ట్ర అధ్యక్షుడు రాజన్న
జన్నారం, ఆంధ్రప్రభ:
రాష్ట్రంలో ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం హర్షనీయమని తెలంగాణ ఎస్సీ,ఎస్టీ ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జాడి రాజన్న అన్నారు.మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశం ఆయన మాట్లాడారు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో ప్రభుత్వ పాఠశాలలను పునర్వ్యవస్థీకరించి, నూతన విద్యా విధానానికి శ్రీకారం చుట్టడం ప్రభుత్వ పాఠశాలలకు శుభపరిణామమని ఆయన తెలిపారు.
గతంలో సరైన రవాణా సౌకర్యాలు లేనందున గ్రామానికి ఒక పాఠశాల ఉండటం సరైనదే అయినప్పటికీ, ప్రస్తుతం రవాణా వసతులు ఎంతో మెరుగైన దృష్ట్యా తక్కువ మంది విద్యార్థులతో పాఠశాలలు నడపడం వల్ల పిల్లలకు ఆశించిన స్థాయిలో నాణ్యమైన విద్య అందడం లేదని,తక్కువ మంది విద్యార్థులున్నా పాఠశాలలను అన్నింటినీ ఒకే చోట చేర్చి దూరం నుండి వచ్చే పిల్లలకు రవాణా వసతి కల్పించడం ఎంతో సమంజసమని ఆయన చెప్పారు.
ప్రతి తరగతికి కనీసం 30 మంది విద్యార్థులు ఉండేలా,ప్రతి సబ్జెక్టుకు ప్రత్యేక ఉపాధ్యాయులు ఉండేలా తీర్చేదిద్దడం ద్వారానే నిరుపేద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని ఆయన అన్నారు.పాఠశాలలను పునర్వ్యవస్థీకరించి, అన్ని రకాల వసతులు కల్పించి,నర్సరీ నుంచి పదో తరగతి వరకు ఒకే పాఠశాల ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ విలేకరుల సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి దుర్గం శ్రీనివాస్,రిటైర్ ఉపాధ్యాయుడు రాజలింగం పాల్గొన్నారు.
