Vijay TVK party | ద్రావిడవాద భవిష్యత్తుపై మేధావుల్లో చర్చ

Vijay TVK party | ద్రావిడవాద భవిష్యత్తుపై మేధావుల్లో చర్చ

Vijay TVK party | 1967లో ప్రారంభమైన ద్రావిడ రాజకీయ యుగం
కామరాజ్ నాడర్ పరాజయం వెనుక రాజకీయ మార్పులు
డీఎంకే, అన్నా డీఎంకేలకు షాక్ ఇచ్చిన టీవీకే
విజయ్ రాజకీయ ప్రవేశంతో తమిళనాడులో కొత్త సమీకరణాలు

Vijay TVK party | 1967 మార్చి నెలలో మద్రాస్‌ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ మట్టికరిపింది. అంతేకాదు, ద్రావిడ మున్నేట్ర కజగం పార్టీ అధికారంలోకి వచ్చి సీ.ఎన్‌. అన్నాదురై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనే మద్రాస్‌ రాష్ట్రం పేరు “తమిళనాడు” అని మార్చారు. తర్వాత ఎప్పుడూ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి ఆ రాష్ట్రంలో రాలేదు. అప్పటినుంచి డీఎంకే కానీ, డీఎంకే నుంచి విడిపోయి ఏర్పడిన అన్నా డీఎంకే కానీ వంతుల వారీగా అధికారాన్ని పంచుకుంటూ వచ్చాయి. జాతీయ పార్టీలనబడేవి ఈ రెండు ద్రావిడ పార్టీలలో ఏదో ఒకదానితో కలిసి సాగేవి. నేషనల్‌ కాంగ్రెస్‌ మాత్రమే కాదు, బీజేపీ కూడా ఇంతవరకు అలాగే చేస్తూ వస్తోంది. ఇలా సాగిన ఆరు దశాబ్దాల చరిత్ర ఇటీవల జరిగిన ఎన్నికలలో ఒక వినూత్న మలుపుకు లోనైంది. రెండు ద్రావిడ పార్టీలైన డీఎంకే, అన్నా డీఎంకే రెండు, మూడు స్థానాల్లో మిగిలిపోతే; కొత్తగా రాజకీయాలలో దిగిన సినిమా నటుడు విజయ్‌ ఏర్పాటు చేసిన రెండేళ్ల వయసుగల టీవీకే పార్టీ అగ్రస్థానంలో నిలబడింది. గత ఆదివారం అధికార పీఠాన్ని అధిరోహించింది కూడా.

తమిళనాడులో వేళ్లూనుకుని ఉన్న ద్రావిడవాదం ద్రవీభవిస్తోందా?… అనే ప్రశ్న పది రోజులుగా పరిపరి విధాలుగా చర్చింపబడుతోంది. ఎగ్జిట్‌ పోల్స్‌లో కూడా అన్నీ ఈసారి కూడా అధికారం డీఎంకేదే అని ఘంటాభజాయించి చెప్పాయి. కానీ ఫలితం మాత్రం ఆ పార్టీని ప్రతిపక్షంలో కూర్చోబెట్టింది. పోనీ అన్నా డీఎంకే అంటే అది మరింత తీసిపోయి వడో స్థానానికి వెళ్లింది. దాంతో ఇంతకాలం ఎంతోకొంత బలవంతంగా మౌనంగా ఉన్న మేధావుల మరో వర్గం రెచ్చిపోయి ఆ వాదానికి కాలం చెల్లిపోయిందనే ప్రచారాన్ని మొదలుపెట్టింది. 1967లో ఆ వాదం ఎంత శక్తివంతంగా ప్రవేశించిందో ఒకసారి గుర్తు చేసుకుందాం.

కామరాజ్‌ నాడర్‌ ఈ ఎన్నికలలోనే చాలా దయనీయంగా 28 ఏళ్ల కుర్రాడి చేతిలో తన సొంత ప్రాంతమైన విరుద్‌నగర్‌ నియోజకవర్గంలో వెయ్యికి మించిన ఓట్ల తేడాతో ఓడిపోయారు. 1937 నుంచి కామరాజ్‌ నాడర్‌ ఎన్నికలలో పోటీ చేస్తూనే ఉన్నారు. అప్పటిదాకా ప్రతిసారి గెలుస్తూనే ఉన్నారు. 1954 నుంచి 1963 వరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సారథ్యం వహించారు. 1963లో కూడా హైకమాండ్‌ తొలగిస్తే తప్పుకున్న ముఖ్యమంత్రి కాదాయన. కాంగ్రెస్‌ పార్టీకి మరింత సేవలు అవసరమని సహచరుడు ఎం. భక్తవత్సలం గారికి ముఖ్యమంత్రి బాధ్యతలు అందజేసినవారు. కామరాజ్‌ నాడర్‌కు తొలుత ఎంతో సాయం చేసి, ఆసరాగా ఉన్న పెరుమాళ్లు నాయుడు కినుకు వహించి తన కుమారుడు శ్రీనివాసన్‌ను డీఎంకే పార్టీ తరఫున పోటీ చేయించి గెలిపించారు. 1967 మార్చి ఎన్నికల ఫలితాలకు సంబంధించి పండితులు, పాత్రికేయులు తిరుమల రామచంద్ర ఆ ప్రాంతంలో పర్యటించి చాలా వివరాలతో “ఆంధ్రపత్రిక”లో సమగ్రమైన విశ్లేషణ వెలువరించారు. కామరాజ్‌ నాడర్‌ రాజకీయంగా ఎదిగిన తర్వాత ఆయనలో వచ్చిన మార్పులు స్థానిక ప్రజలను కొంత అసంతృప్తికి గురిచేశాయని, ఆ సమయంలో డీఎంకే పార్టీ ద్వారా యువకుడైన శ్రీనివాసన్‌ గెలుపు సులువు అయిందని తిరుమల రామచంద్ర వివరించారు.

కామరాజ్‌ నాడార్‌ (1903-1975) పెద్దగా చదువుకోలేదు. అయితే ఆయన చిత్తశుద్ధి, సామాన్యమైన జీవితం ప్రజలను ఆకర్షించాయి. ఖాదీ షర్టు, పంచెతో మాత్రమే ఉంటూ, గాంధీజీని గౌరవించే ఈ పల్లె ప్రాంతపు నాయకుడిని “బ్లాక్‌ గాంధీ” అనేవారు. ఏ పదవిలో ఉన్నా అంది వచ్చే సదుపాయాలను, సౌకర్యాలను పెద్దగా వినియోగించుకున్నది లేదు. ప్రజా వ్యవస్థలు సమాజానికి దోహదపడాలి, కాని అధికారంలో ఉన్న వ్యక్తులకు కాదు అని బలంగా నమ్మేవారు. కనుకనే తనకు పోలీసు ప్రొటెక్షన్‌, సెక్యూరిటీ వంటివి వద్దని తిరస్కరిస్తూ అవి ప్రజాధనానికి చిల్లు అని వాదించేవారు. ఆయనకు సొంత ఆస్తి ఏమీ లేదు. 1975 అక్టోబర్‌ 2న కామరాజ్‌ నాడర్‌ గతించినప్పుడు ఆయన వద్ద కేవలం 130 రూపాయల నగదు, రెండు జతల చెప్పులు, నాలుగు జతల షర్టులు, పంచెలు ఇంకా కొన్ని పుస్తకాలు మాత్రమే ఉన్నాయని అప్పట్లో విశేషంగా చర్చించుకున్నారు. కర్మవీరుడుగా కొనియాడబడిన కామరాజ్‌ నాడర్‌ కన్నుమూసిన తర్వాతనే యూనివర్సిటీ, విమానాశ్రయం, రైల్వే స్టేషన్‌.. ఇలా కొన్ని ఆయన పేరును తమ పేరులో కలుపుకున్నాయి. ఇంత నిరాడంబరమైన వ్యక్తి, నిస్వార్థమైన జీవితాన్ని గడిపిన నాయకుడు 1967లో అలా పరాజయం పొందడం విశేషమైన అంశమే.

2026లో పోటీలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఇతర పార్టీలతో కలిసి జట్లుగా పోటీ చేసిన సందర్భంలో సరికొత్త పార్టీ టీవీకే తమిళనాడు రాష్ట్రంలో అన్ని స్థానాలకు సొంతంగా పోటీ చేసి, అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవడం ఇప్పుడు పెద్ద చర్చ. ఇలా గెలిచినంత మాత్రాన ద్రావిడవాదం ద్రవించి పోతుందని ఎలా నిర్ణయిస్తారు? అనే ప్రశ్న కూడా సబబే. టీవీకే పార్టీ స్థాపించిన విజయ్‌ తొలుత తన ప్రణాళికను ప్రకటించి, తన ప్రచారం తన పద్ధతిలో చేస్తూ వెళ్లినప్పుడు ఎవరు పెద్దగా ఖాతరు చేయలేదు. విజయ్‌ పార్టీ ఒక్కసారిగా 108 స్థానాలు గెలవడం, మరోవైపు మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎంకే స్టాలిన్‌ దయనీయంగా ఎమ్మెల్యేగా కూడా ఓడిపోవడం ఇక్కడ కీలకమైన విశేషాలు. రామస్వామి పెరియార్‌తో పాటు కామరాజ్‌ నాడర్‌, బీఆర్‌ అంబేద్కర్‌ ఆశయాల గురించి ప్రధానంగా ప్రస్తావించడం మరో కోణం. వీటికి మించి తొలిసారి ఇద్దరు చారిత్రక మహిళలు రాణి వేళు నాచార్‌, అంజలై అమ్మాళ్‌ తమ పార్టీకి ఆదర్శవంతులుని ప్రకటించడం ఇంకో విశేషమైన మలుపు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు తమిళనాడు పొలిటికల్‌ బ్రాండ్‌ అయిన తెల్ల అడ్డపంచెతో విజయ్‌ వస్తారని ఆశించిన వారికి ఆయన సూటు, బూటుతో రావడం పెద్ద షాక్‌. ఆరోజు ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులలో నాలుగు దశాబ్దాల తర్వాత ఒక బ్రాహ్మణుడు ఉండటం గమనించదగ్గ ఇంకో చమక్కు. మహా నాయకుడు కామరాజ్‌ నాడర్‌ను ఎమ్మెల్యేగా కూడా గెలవనీయని ద్రావిడవాదం ఇప్పుడేమవుతోందని గమనించడం, చర్చించడం అవసరమే!

డా. నాగసూరి వేణుగోపాల్‌
ప్రముఖ రచయిత మరియు ఆకాశవాణి విశ్రాంత సంచాలకులు
9440732392