ప్రజాసేవకు ప్రతిరూపం డా.బీ.లక్ష్మీకాంతం
ప్రజాసేవకు ప్రతిరూపం డా.బీ.లక్ష్మీకాంతం
కలెక్టర్‌గా ప్రత్యేక గుర్తింపు
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : నిరంతర కృషి, ప్రజల పట్ల అంకితభావం, వినూత్న ఆలోచనలతో ప్రజల మనసుల్లో చెరగని ముద్రవేసుకున్న మాజీ ఐఏఎస్ అధికారి బీ.లక్ష్మీకాంతం. ఒక అధికారి బదిలీ జరిగినప్పుడు సాధారణంగా అధికారుల వీడ్కోలు మాత్రమే ఉంటుంది. కానీ లక్ష్మీకాంతం వెళ్లిపోతున్నారంటే ప్రజలే వీధుల్లోకి వచ్చి పూలవర్షం కురిపించి, సంప్రదాయ నృత్యాలతో ఘనంగా వీడ్కోలు పలికారు. ఆయన అందించిన నిస్వార్థ సేవలకు అది ప్రజల కృతజ్ఞత. చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలోని పిళ్లారికుప్పం గ్రామంలో జన్మించిన లక్ష్మీకాంతం, ఉన్నత విద్యనభ్యసించి తన తండ్రి కలను నిజం చేస్తూ పరిపాలనా సేవల్లోకి ప్రవేశించారు. ఉపాధ్యాయుడిగా ఉద్యోగ జీవితం ప్రారంభించిన ఆయన, అనంతరం డిప్యూటీ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి ప్రజాసేవలో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కృష్ణా జిల్లాల్లో వివిధ హోదాల్లో పని చేస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇచ్చారు.

ఎక్కడ విధులు నిర్వహించినా అభివృద్ధి, సంక్షేమం, ప్రజా భాగస్వామ్యానికి పెద్దపీట వేశారు. భూసమస్యల పరిష్కారం, ఉపాధి కల్పన, మహిళలు, యువత, విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించే కార్యక్రమాలు చేపట్టారు. కృష్ణాజిల్లా కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో ప్రజలకు మరింత చేరువై అనేక వినూత్న కార్యక్రమాలను అమలు చేసి ప్రశంసలు అందుకున్నారు. ఉత్తమ కలెక్టర్‌గా అవార్డును కూడా అందుకున్నారు. పర్యావరణ పరిరక్షణలోనూ ఆయన కృషి విశేషం. వేలాది మొక్కల నాటడాన్ని ప్రజా ఉద్యమంగా మార్చారు. కావలిలో చెరువు పునరుద్ధరణకు చేసిన కృషికి గుర్తింపుగా స్థానికులు ఆ చెరువుకు ఆయన పేరునే పెట్టడం విశేషం. ప్రజారోగ్యం, ఓటరు చైతన్యం, పరిపాలనా నాణ్యత పెంపులో చేపట్టిన కార్యక్రమాలు జాతీయ, అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చాయి. గిన్నిస్ బుక్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డుల్లోనూ ఆయన పేరు నమోదైంది.
ఉద్యోగ విరమణ తర్వాత కూడా ఆయన సేవా ప్రస్థానం ఆగలేదు. పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం, పుస్తకాల పంపిణీ, ఉన్నత విద్యకు ప్రోత్సాహం అందిస్తున్నారు. అలాగే అవసరమైన వైద్య సహాయం అందిస్తూ అనేక మంది పేద రోగులకు అండగా నిలుస్తున్నారు. యువతకు మార్గదర్శకుడిగా, వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా, కెరీర్ సలహాదారుడిగా దేశ విదేశాల్లో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉపాధి అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి, సివిల్ సర్వీసులపై అవగాహన కల్పిస్తూ యువతలో స్ఫూర్తిని నింపుతున్నారు. అంతర్జాతీయ వేదికలపై భారతదేశ ప్రతినిధిగా పలు అంశాలపై ప్రసంగిస్తూ గుర్తింపు పొందుతున్నారు. ప్రజా సేవను ఉద్యోగంతో పరిమితం చేయకుండా, జీవిత ధ్యేయంగా మార్చుకున్న లక్ష్మీకాంతం వంటి వ్యక్తులు సమాజానికి ఆదర్శప్రాయులు. ప్రజల ప్రేమ, గౌరవం, అనేక పురస్కారాలు ఆయన సేవా తపనకు నిదర్శనాలు. నేటికీ యువతకు స్ఫూర్తిగా, సమాజానికి మార్గదర్శిగా ఆయన ప్రయాణం కొనసాగుతూనే ఉంది.
