ఆపదలో అండగా ఉంటూ..
ఆపదలో అండగా ఉంటూ..
ఆదుకున్న ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్
క్యాతన్ పల్లి, ఆంధ్రప్రభ : ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న గుండె జబ్బు బాధితుడికి ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ చేయూతనిచ్చింది. రామకృష్ణాపూర్ పట్టణంలోని జ్యోతినగర్ కు చెందిన పాండురాజు రాయమల్లు గుండెలో మూడు కవాటాలు మూసుకుపోవడంతో తీవ్ర ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. వైద్యులు ఆపరేషన్ కోసం దాదాపు ₹5 లక్షలు ఖర్చు అవుతుందని తెలిపారు. చిన్నచిన్న కూలి పనులు చేసుకునే పాండురాజు కుటుంబం ఆ మొత్తం సమకూర్చుకునే స్థోమత లేకపోవడంతో సహాయం కోసం ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ ను ఆశ్రయించారు.
స్పందించిన ట్రస్ట్ సభ్యులు వెంటనే జ్యోతినగర్‌లోని వారి నివాసానికి వెళ్లి ట్రస్ట్ తరపున ₹10,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షులు సుంకరి మల్లేష్, సభ్యులు సట్ల మహేందర్, పట్టణ రజక సంఘ అధ్యక్షుడు నడిగోట తిరుపతి, రఘు పాల్గొన్నారు. పాండురాజు ఆపరేషన్‌కు ఇంకా పెద్ద మొత్తం అవసరం ఉండటంతో దాతలు, హృదయం ఉన్నవారు ఆదుకోవాలని ట్రస్ట్ సభ్యులు విజ్ఞప్తి చేశారు.
