విగ్రహం పేరుతో స్థల కబ్జా..

ఇంచార్జ్ బండారు నానిపై మహిళ తీవ్ర ఆరోపణలు
మచిలీపట్నం – ఆంధ్రప్రభ : మచిలీపట్నం బలరామునిపేట ప్రాంతంలో విగ్రహం ఏర్పాటు పేరుతో తన స్థలాన్ని కబ్జా చేశారని దేవరపల్లి రాణి అనే మహిళ స్థానిక ఇంచార్జ్ బండారు నానిపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ వ్యవహారంలో తమ కుటుంబాన్ని మానసికంగా, సామాజికంగా వేధింపులకు గురిచేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కులం నుండి బహిష్కరించామంటూ పదేపదే వేధిస్తున్నారని ధ్వజమెత్తింది.
మహిళ తెలిపిన వివరాల ప్రకారం.. తమ ఇంటి పరిసరాల్లో మహిళల గోప్యతను పట్టించుకోకుండా స్నానాల గదుల వైపు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారని, దీంతో తమ కుటుంబ సభ్యులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని ఆరోపించింది. అంతేకాకుండా నేర చరిత్ర కలిగిన వ్యక్తులను విగ్రహం వద్ద ఉంచి తమను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని బండారు నానిపై మండిపడింది. రాత్రి సమయంలో గంజాయి బ్యాచ్ ఆగడాలు తట్టుకోలేకపోతున్నామని మహిళ తెలిపింది.
కేవలం స్థల వివాదంతో ఆగకుండా, తమకు కనీస అవసరమైన తాగునీటి సదుపాయాలను కూడా ధ్వంసం చేశారని మహిళ వాపోయింది. ఇంటికి వచ్చే మంచినీటి కుళాయిలను పగలగొట్టడమే కాకుండా, మురుగునీరు బయటకు వెళ్లే పైప్‌లైన్‌ను కూడా ధ్వంసం చేశారని తెలిపింది. తమ ఇంటి గుమ్మానికి ఎదురుగా గోడ నిర్మించి రాకపోకలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆరోపించింది.
ఈ సమస్యపై ఇప్పటికే పలువురు అధికారులను, రాజకీయ నాయకులను కలిసినా ఎవరూ పట్టించుకోలేదని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. న్యాయం కోసం చివరకు కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపింది. విగ్రహం ఏర్పాటు కోసం ఎటువంటి అధికారిక అనుమతులు మంజూరు చేయలేదని నగరపాలక కమిషనర్ కోర్టుకు వ్రాతపూర్వకంగా సమర్పించినట్లు మహిళ తెలిపింది.
ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టే ఆర్డర్ జారీ చేసినట్లు మహిళ పేర్కొంది. అయినప్పటికీ కేసును వెనక్కి తీసుకోవాలని బండారు నాని తమను బెదిరిస్తున్నారని ఆరోపించింది. ఇప్పటికైనా జిల్లా అధికారులు, పోలీసు శాఖ స్పందించి తమ కుటుంబానికి రక్షణ కల్పించి న్యాయం చేయాలని దేవరపల్లి రాణి వేడుకుంది.
కాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కృష్ణా జిల్లా ఎస్పీని ఈ కేసులో విగ్రహ పీఠం నిర్మాణానికి బాధ్యులెవరో గుర్తించి దర్యాప్తు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ తేదీకి ముందు పూర్తి నివేదిక సమర్పించాలని తెలిపింది. అలాగే ఇప్పటికే ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు అమలులో ఉండేలా, శాంతిభద్రతలు కాపాడేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది.
