ఏటుకూరు భూముల సమస్యకు పరిష్కారానికి కీలక అడుగు

పెమ్మసాని చొరవతో 22-ఏ జాబితా నుంచి 5.93 ఎకరాల తొలగింపు
కలెక్టర్ ఉత్తర్వులు.. స్థానికులకు ఊరట

గుంటూరు, ఆంధ్రప్రభ : ఏళ్లుగా పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న ఏటుకూరు గ్రామ భూముల సమస్యలో కీలక పరిణామం చోటుచేసుకుంది. గ్రామంలోని సర్వే నెం.74లో ఉన్న 5.93 ఎకరాల భూమిని 22-ఏ నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఈ భూములకు సంబంధించిన లావాదేవీలపై ఉన్న అడ్డంకులు తొలగే అవకాశం ఏర్పడింది.

ఈ సమస్య పరిష్కారానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. స్థానికుల నుంచి వినతులు అందుకున్న అనంతరం రెవెన్యూ, ఎండోమెంట్స్, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులతో పలుమార్లు సమీక్షలు నిర్వహించి, న్యాయపరమైన అంశాలను పరిశీలిస్తూ పరిష్కారానికి కృషి చేశారు.

సంబంధిత శాఖల నివేదికలు, న్యాయపరమైన అంశాలను పరిశీలించిన అనంతరం జిల్లా కలెక్టర్ సాయి కాంత్ వర్మ సర్వే నెం.74లోని 5.93 ఎకరాల భూమిని 22-ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు ఆమోదం తెలిపారు. అయితే ఈ ఉత్తర్వులు ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న రివ్యూ పిటిషన్ తుది తీర్పుకు లోబడి అమలులో ఉంటాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

ఈ నిర్ణయంతో ఎన్నో సంవత్సరాలుగా భూములపై హక్కుల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్థానిక కుటుంబాలకు గణనీయమైన ఊరట లభించనుంది.

ఈ సందర్భంగా సమస్య పరిష్కారానికి సహకరించిన ప్రతిపాడు ఎమ్మెల్యే బి. రామాంజనేయులు, జిల్లా కలెక్టర్ సాయి కాంత్ వర్మ, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవతో పాటు సంబంధిత శాఖల అధికారులకు కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కృతజ్ఞతలు తెలిపారు.
కాగా ఏటుకూరుకు చెందిన టీడీపీ నేత ఉగ్గిరాల సీతారామయ్య, డేగల ఉదయ్, పోతుల రాము, దాసరి వాసు, నిశ్శంకరావు నవీన్, మక్కే సురేష్,, యర్రంశెట్టి శివ రామ్ కృష్ణ, బుర్రగడ సాయి తదితరులు కూడా కలెక్టర్, ఎమ్మెల్యే రామాంజనేయులును కలిసి ప్రత్యేక అభినందనలు తెలిపారు.