ఆంధ్రపభ ప్రతినిధి, భూపాలపల్లి: పిచ్చి కుక్కల స్వైరవిహారంతో 15 మందికి గాయాలయ్యాయి. జీపీ అధికారుల నిర్లక్ష్యంతో గ్రామాల్లో విచ్చలవిడిగా సంచరిస్తూ ప్రజలపై దాడులు చేస్తూ ప్రాణాల మీదకు తెస్తున్నాయి. పిల్లలు పెద్దలు తేడా లేకుండా అందరి పై దాడులు చేస్తున్నాయి. తాజాగా.. జయశంకర్ జిల్లా భూపాలపల్లి మండలం కొంపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీలో పిచ్చి కుక్కల రెచ్చిపోయాయి. బయట కనపడ్డ సుమారు 15 మంది పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి.

కుక్కల దాడి లో ఎకూ సుకన్య, ఎడ్ల నవీన్, మోరే సరోజన, వెంకటయ్య, సడల పైడయ్య, పసుల జస్వంత్, ఎకు చిట్టి, ఎడ్ల మమత, సడల సునీల్ తదితరులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని జిల్లా కేంద్రం లోని వంద పడకల ఆసుపత్రికి తరలించగా మరో నలుగురు పరిస్థితి విషమంగా ఉండటంలో వరంగల్ ఎంజీఎం కు తరలించినట్లు గ్రామస్థులు తెలిపారు. జిల్లా అధికారులు స్పందించి పిచ్చి కుక్కల్ని నియంతించాలని ప్రజలు కోరుతున్నారు.