డీఎస్సీ ర్యాలీకి వెళ్లకుండా డీఎన్ఆర్‌ హౌస్‌ అరెస్ట్‌..

కైకలూరు టౌన్, ఆంధ్రప్రభ : 2025 మెగా డీఎస్సీలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు సోమవారం చేపట్టిన ర్యాలీలో పాల్గొనకుండా ఏలూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, కైకలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్ఆర్)ను పోలీసులు హౌస్‌ అరెస్ట్ చేశారు. డీఎస్సీ అక్రమాలపై శాంతియుతంగా ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమైన నేపథ్యంలో పోలీసులు తనను ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకోవడంపై డీఎన్ఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. “డీఎస్సీలో ఎలాంటి అక్రమాలు జరగకపోతే కూటమి ప్రభుత్వం ఎందుకు ఉలిక్కిపడుతోంది?” అని ప్రశ్నించారు.
ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా చేపడుతున్న ర్యాలీని అడ్డుకోవడం సరికాదన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్యాయంతో పరిపాలన కొనసాగించాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ వ్యవహారంలో అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డీఎన్ఆర్ డిమాండ్ చేశారు. డీఎన్ఆర్‌ను హౌస్‌ అరెస్ట్‌ చేయడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఆయన నివాసానికి చేరుకున్నారు. దీంతో ఆయన నివాసం వద్ద కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డీఎస్సీ వ్యవహారంపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను ప్రజల ముందుంచాలని వైఎస్సార్‌సీపీ నాయకులు డిమాండ్ చేశారు.