భవనాల డిజైన్లపై లండన్‌లో కీలక చర్చలు
- అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ టవర్ల ముఖభాగాల రూపకల్పనపై సమాలోచనలు
- ప్రముఖ ఆర్కిటెక్టులతో మంత్రి నారాయణ చర్చలు
అమరావతి, ఆంధ్రప్రభ: అమరావతిని ప్రపంచ ప్రమాణాలతో కూడిన రాజధానిగా అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. మంత్రి లండన్ పర్యటనలో భాగంగా అమరావతిలో నిర్మించనున్న అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ టవర్ల ముఖభాగపు డిజైన్లపై ప్రముఖ ఆర్కిటెక్టులు, కన్సల్టెన్సీ సంస్థల ప్రతినిధులతో చర్చించినట్లు ఆయన వెల్లడించారు.
అసెంబ్లీ భవనం పైభాగంలో ప్రతిపాదించిన స్పియర్ టవర్‌తో పాటు నార్మన్ + ఫోస్టర్, హఫీజ్ కాంట్రాక్టర్, బ్యూరో హ్యాపోల్డ్, ఎల్అండ్టీ సంస్థలు రూపొందించిన డిజైన్లను సమీక్షించినట్లు నారాయణ తెలిపారు. డిజైన్లను తుది నిర్ణయానికి తీసుకెళ్లేందుకు అవసరమైన కీలక అంశాలపై నిపుణులతో చర్చించినట్లు పేర్కొన్నారు.
అదేవిధంగా అమరావతిలో కొనసాగుతున్న నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించిన మంత్రి.. రాబోయే దశల్లో చేపట్టాల్సిన పనులపై నిపుణుల సలహాలు తీసుకున్నట్లు తెలిపారు. నిర్మాణ నాణ్యత, రూపకల్పన, ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు.
అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని నారాయణ తెలిపారు. రాజధాని నిర్మాణంలో అత్యాధునిక డిజైన్లు, అంతర్జాతీయ ప్రమాణాలను సమన్వయం చేస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

