టూర్ ఆపరేటర్లతో మంత్రి కందుల దుర్గేష్ కీలక భేటీ
- కొత్త ప్యాకేజీల అభివృద్ధికి పిలుపు
- ఏపీ పర్యాటక అవకాశాలను వివరించిన మంత్రి కందుల దుర్గేష్
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని అపారమైన పర్యాటక అవకాశాలను దేశ, విదేశీ పర్యాటకులకు మరింత చేరువ చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కోరారు. న్యూఢిల్లీలో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ (ఐఏటీవో), ట్రావెల్ ట్రేడ్, హోటల్ రంగ ప్రతినిధులతో నిర్వహించిన ప్రత్యేక రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆధ్యాత్మికం, సంస్కృతి, చరిత్ర, తీరప్రాంతాలు, ప్రకృతి అందాలు, వెల్నెస్, క్రూయిజ్ టూరిజం వంటి విభిన్న పర్యాటక అనుభవాలకు ఆంధ్రప్రదేశ్ నిలయంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేలా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పెట్టుబడిదారులకు అనుకూలమైన పర్యాటక విధానాలు, మెరుగైన మౌలిక వసతులు, రవాణా సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని రాష్ట్రానికి మరింత మంది పర్యాటకులను ఆకర్షించాలని మంత్రి సూచించారు.
టూర్ ఆపరేటర్లు కొత్త టూర్ ప్యాకేజీలు, గమ్యస్థాన ఆధారిత పర్యాటకం, అనుభవపూర్వక పర్యాటకం, సర్క్యూట్ ఆధారిత పర్యాటక అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కోరారు.
విశాఖలో ఐఏటీవో వార్షిక సదస్సు..
2026 సెప్టెంబర్ 10 నుంచి 13 వరకు విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ, ఐఏటీవో సంయుక్తంగా నిర్వహించనున్న వార్షిక సదస్సుకు దేశ, విదేశీ టూర్ ఆపరేటర్లు, పర్యాటక రంగ నిపుణులు పెద్ద సంఖ్యలో హాజరై రాష్ట్రంలోని పర్యాటక అవకాశాలను ప్రత్యక్షంగా పరిశీలించాలని మంత్రి ఆహ్వానించారు.
ట్రావెల్ ట్రేడ్ భాగస్వాములతో బలమైన సంబంధాలను ఏర్పరుచుకుని ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అత్యంత ఆకర్షణీయమైన పర్యాటక గమ్యస్థానంగా, ప్రపంచ పర్యాటక పటంలో ప్రముఖ స్థానంలో నిలిపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కందుల దుర్గేష్ తెలిపారు.

