రాహుల్ సభ తర్వాతే నాపై రాజకీయ కుట్రలు
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : సంగారెడ్డిలో నిర్వహించిన బీఎల్ఏల సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014లో తాను ఓడిపోయిన తర్వాత తనపై రాజకీయ కుట్రలు జరిగాయని ఆరోపించారు.
సంగారెడ్డికి మంజూరైన మెడికల్ కాలేజీని సిద్దిపేటకు తరలించడంలో అప్పటి బీఆర్ఎస్ నాయకత్వం కీలక పాత్ర పోషించిందని అన్నారు. 2013లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సంగారెడ్డికి మెడికల్ కాలేజీ కోసం ప్రతిపాదనలు పంపారని తెలిపారు. ఆ తర్వాత కాలేజీని సిద్దిపేటకు తరలించారని పేర్కొన్నారు.
మెడికల్ కాలేజీ కోసం మూడేళ్ల పోరాటం
సంగారెడ్డికి మెడికల్ కాలేజీ సాధన కోసం మూడేళ్లపాటు పోరాటం చేశానని జగ్గారెడ్డి తెలిపారు. తన ఉద్యమాన్ని అడ్డుకునేందుకు పోలీసులతో కేసులు పెట్టించే ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు.
2015లో సంగారెడ్డిలో రాహుల్‌గాంధీ సభ నిర్వహించాలని అప్పటి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారని చెప్పారు. కాంగ్రెస్ నుంచి వలసలు పెరగకుండా సభ నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పినట్లు తెలిపారు.
సుమారు మూడు లక్షల మందితో సభ నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించి, సుమారు రూ.6.5 కోట్ల అప్పు తెచ్చి సభను విజయవంతం చేశామని పేర్కొన్నారు. రాహుల్‌గాంధీ సభ విజయవంతం కావడంతోనే తనపై రాజకీయ పరిణామాలు మొదలయ్యాయని ఆరోపించారు.
నా ఆస్తులపై విచారణ జరిపించారు
తాను అక్రమాలకు పాల్పడ్డానా అనే కోణంలో అప్పటి సిటీ కమిషనర్ మహేందర్‌రెడ్డి, ముగ్గురు విజిలెన్స్ ఐపీఎస్ అధికారులు, నలుగురు డీఎస్పీలతో విచారణ జరిపించారని జగ్గారెడ్డి తెలిపారు.
విచారణలో తనకు అక్రమ ఆస్తులు, ఇళ్లు లేవని నివేదిక ఇచ్చారని పేర్కొన్నారు. పటాన్చెరులో భూ దందాలకు పాల్పడ్డానా అనే అంశంపైనా విచారణ జరిపించారని చెప్పారు.
తనపై 40 పిటిషన్లు వేయించి పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేయించే ప్రయత్నాలు జరిగాయని జగ్గారెడ్డి ఆరోపించారు. చివరకు పాస్‌పోర్టు కేసులో తనను అరెస్ట్ చేసి జైలుకు పంపారని అన్నారు.
రాజకీయ కక్ష సాధింపు చేయను
తనపై జరిగిన పరిణామాల గురించి సంగారెడ్డి ప్రజలకు వాస్తవాలు తెలియాలనే చెబుతున్నానని జగ్గారెడ్డి అన్నారు. తాను ప్రతీకార రాజకీయాలకు దూరంగా ఉంటానని స్పష్టం చేశారు.
హరీష్‌రావును నిందించడం లేదు
హరీష్‌రావును తాను టార్గెట్ చేయడం లేదని, నిందించడం లేదని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ‘‘ఆయన వ్యూహంలో ఆయనే కరెక్ట్. మీరు ఫీల్ కావొద్దు.. మీ పని మీరు చేశారు’’ అని వ్యాఖ్యానించారు.
గతంలో తనపై జరిగిన రాజకీయ పరిణామాలను ప్రజలకు వివరించడమే తన ఉద్దేశమని, తాను మాత్రం రివెంజ్ పాలిటిక్స్ చేయబోనని జగ్గారెడ్డి పేర్కొన్నారు.
