గంజాయి గ్యాంగ్‌కు పోలీసుల షాక్!
2 కేజీల గంజాయి స్వాధీనం.. నిందితులకు 14 రోజుల రిమాండ్
ఉంగుటూరు, ఆంధ్రప్రభ: గంజాయి అక్రమ రవాణా, విక్రయానికి పాల్పడుతున్న ఏడుగురిని ఉంగుటూరు పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 2 కేజీల గంజాయి, రెండు ద్విచక్ర వాహనాలు, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను ఉంగుటూరు ఎస్‌ఐ యు.గోవిందు సోమవారం పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
ఉంగుటూరు మండలం గరపాడు గ్రామ పరిధిలోని దాసరి జయ డొంక రోడ్డుపై కొందరు వ్యక్తులు గంజాయిని విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నారన్న సమాచారంతో సోమవారం ఉదయం 8 గంటల సమయంలో ఎస్‌ఐ గోవిందు తన సిబ్బందితో కలిసి ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా ఉన్న ఏడుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు.
వారి వద్ద తనిఖీలు నిర్వహించగా 2 కేజీల గంజాయితో పాటు రెండు ద్విచక్ర వాహనాలు, మూడు మొబైల్ ఫోన్లు లభించాయని పోలీసులు తెలిపారు. నిందితులను షేక్ సిద్ధిక్ హుస్సేన్ బాషా, కస్తూరి హర్షవర్ధన్, కస్తూరి కార్తీక్, గోగు సంతోష్, అరేపల్లి సురేష్, చిట్టిపోతుల ప్రభు, చాట్ల చైతన్యగా గుర్తించారు.
అరెస్టు చేసిన నిందితులను న్యాయస్థానం ముందు హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించినట్లు ఎస్‌ఐ గోవిందు తెలిపారు.
ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించిన పోలీసు సిబ్బందిని గన్నవరం డీఎస్పీ కె.ధర్మేంద్ర, సీఐ బి.శివప్రసాద్ అభినందించారు. చట్టవ్యతిరేకంగా గంజాయి రవాణా, విక్రయం, వినియోగానికి పాల్పడే వారిపై కృష్ణా జిల్లా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని అధికారులు స్పష్టం చేశారు.
యువత గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఎస్‌ఐ గోవిందు సూచించారు. ఈ తనిఖీల్లో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
