నిర్ణీత గడువులో నాణ్యమైన పరిష్కారం చూపాలి

  • కలెక్టరేట్‌ లో మీకోసం కార్యక్రమం
  • అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

మచిలీపట్నం, ఆంధ్రప్రభ: ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ప్రజల నుంచి అందిన అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా నిర్ణీత గడువులోగా నాణ్యమైన పరిష్కారం చూపాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక–మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించిన కలెక్టర్, జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రతి అర్జీదారుడి సమస్యను ఓపికగా ఆలకించి, సమస్య పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, డిఆర్ఓ కే శ్రీధర్ రెడ్డి, కె ఆర్ ఆర్ సి ఎస్డిసి పి నీలకంఠేశ్వరరెడ్డి, మహిళా పోలీస్ స్టేషన్ ఎస్సై వాకా వెంకటేశ్వరరావుతో కలిసి ఆయన అర్జీలు స్వీకరించారు.

అధికారుల వద్దకు చేరిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని అర్జీదారులకు సంతృప్తికరమైన పరిష్కారం అందించాలని కలెక్టర్ సూచించారు. అర్జీల పరిష్కార ప్రక్రియను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ, నిర్ణీత గడువులోగా చర్యలు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

అర్జీలలో కొన్ని:

  • విన్నకోట గ్రామపంచాయతీ పరిధిలోని 14 చెరువుల లీజు ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచాలని అర్జీదారు కోరారు. గతంలో రూ.24.22 లక్షలు, రూ.27.16 లక్షలు ఆదాయం రాగా, ప్రస్తుతం 2026–29 కాలానికి కేవలం రూ.9.50 లక్షలకే లీజు నిర్ణయించడంతో పంచాయతీ ఆదాయం తగ్గిందని పేర్కొన్నారు. గతంలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి, 14 చెరువులను బహిరంగ వేలం ద్వారా నిర్వహించి గ్రామపంచాయతీ ఆదాయాన్ని పెంచాలని గుడ్లవల్లేరు మండలం విన్నకోట గ్రామస్తులు కలెక్టర్ ను కోరారు.

కార్యక్రమంలో డీఆర్డిఏ, మెప్మా పీడీలు హరిహర నాథ్, సాయిబాబు, ఆర్ అండ్ బీ ఈఈ లోకేశ్వరావు, ఎల్డిఎం రవీంద్రారెడ్డి, మత్స్య శాఖ అధికారి అయ్యా నాగరాజా, ఐసీడీఎస్ పీడీ ఐ విమల, వ్యవసాయ శాఖ జేడి జ్యోతి రమణి, డీఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ పీఎల్ దయాకర్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సోమశేఖర్, సర్వే ఏడీ లక్ష్మణరావు, డ్రైనేజీ శాఖ ఈఈ కిరణ్ బాబు, డ్వామా పీడీ ఎన్ శివప్రసాద్ యాదవ్, మార్క్ఫెడ్ డిఎం మురళీ కిషోర్, మార్కెటింగ్ ఏడీ నిత్యానంద్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.