23rdMayeditorial | తమిళ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు!

23rdMayeditorial | తమిళ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు!

23rdMayeditorial | డీఎంకే-కాంగ్రెస్ మైత్రిలో విభేదాల సంకేతాలు
రాజ్యసభ బలంపై బీజేపీ ఫోకస్
ఇండియా కూటమికి పెరుగుతున్న సంక్షోభం
తమిళనాడులో రాజకీయ సమీకరణాల మార్పు
ప్రతిపక్ష ముక్త భారత్ దిశగా బీజేపీ వ్యూహం

23rdMayeditorial | తమిళనాడులో పదేళ్లకు పైగా డీఎంకేతో కాంగ్రెస్ మైత్రి కొనసాగింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో సినీనటుడు, మెగాస్టార్ విజయ్‌తో పొత్తు కారణంగా ఆ మైత్రిలో విభేదాలు తలెత్తాయి. డీఎంకే వల్ల కాంగ్రెస్ రాష్ట్రంలో లాభపడింది. రాజ్యసభ స్థానాలను కూడా గెలుచుకుంది. ఇప్పుడు ఆ రాజ్యసభ స్థానాలపై బీజేపీ కన్నేసింది. రాజ్యసభలో బలం పెంచుకోవడానికి బీజేపీ కొంతకాలంగా ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ తనంతట తానే దూరం కావడంతో డీఎంకే తన వైఖరిని మార్చుకోవచ్చన్న ఊహాగానాలు కొద్దిరోజులుగా సాగుతున్నాయి.

నిజానికి డీఎంకే మతతత్వ శక్తులకు దూరంగా ఉండాలన్న సిద్ధాంతం కలిగిన పార్టీ. అయితే, గతంలో వాజ్‌పేయి హయాంలో ఆయన నేతృత్వంలోని ఎన్డీఏలో డీఎంకే భాగస్వామ్యం కలిగి ఉండటమే కాకుండా, వాజ్‌పేయి మంత్రివర్గంలో డీఎంకే నాయకుడు మురసోలి మారన్ కొనసాగారు. అందువల్ల బీజేపీని డీఎంకే అంటరాని పార్టీగా పరిగణించడం లేదు. వాజ్‌పేయి ప్రభుత్వం పతనానంతరం ఆనాటి డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి తన రాజకీయ చాతుర్యాన్ని ఉపయోగించి, ఎన్డీఏకి దూరమై కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమిలో చేరారు. ఆ విధంగా కాంగ్రెస్‌తో మైత్రిని డీఎంకే కొనసాగిస్తూ వచ్చింది. మురసోలి మారన్ కుమారుడు దయానిధి మారన్ యూపీఏ మంత్రివర్గంలో పని చేశారు.

ఇప్పుడు రాజకీయ సమీకరణాలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమిళనాడులో కాలూనేందుకు బీజేపీ ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. మొన్నటి ఎన్నికల్లో అన్నా డీఎంకేతో పొత్తు కుదుర్చుకుంది. విజయ్ పూర్తి మెజారిటీ రాకపోవడంతో అన్నా డీఎంకే, డీఎంకేలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నించాయి. ఇప్పుడు రాజ్యసభలో బలాన్ని పెంచుకోవడానికి డీఎంకేని చేరదీయాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.

ఇండియా కూటమి నుంచి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత, ఆప్ సారథి అరవింద్ కేజ్రీవాల్ వైదొలగడంతో ఇప్పటికే కూటమి బలహీనమైంది. ఇప్పుడు డీఎంకే కూడా వైదొలిగితే ఇండియా కూటమి నామమాత్రంగా మిగిలే పరిస్థితి కనిపిస్తోంది. ఆ కూటమికి ఇప్పటికీ కాంగ్రెస్ నేతృత్వం వహిస్తోంది. అలాగే, ఈ కూటమి భాగస్వామ్య పక్షమైన సమాజ్‌వాదీ పార్టీ కాంగ్రెస్‌తో మైత్రిని అంతంత మాత్రంగానే కొనసాగిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కచ్చితంగా గెలిచే స్థానాలను మాత్రమే ఆ పార్టీకి విడిచిపెడతామని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కరాఖండిగా స్పష్టం చేశారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అసోంలో అధికారాన్ని నిలబెట్టుకుంది. పశ్చిమ బెంగాల్‌లో కూడా తన ప్రభావాన్ని పెంచుకుంది. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి అస్తిత్వాన్ని పూర్తిగా దెబ్బతీయాలనే ఆలోచనలో ఉన్న బీజేపీకి ఇప్పుడు ఈ అవకాశం కలిసి వచ్చినట్లు కనిపిస్తోంది. “కాంగ్రెస్ ముక్త భారత్” తమ లక్ష్యమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తరచూ అంటుంటారు. ఇప్పుడు ప్రతిపక్ష ముక్త భారత్‌ను సాధించేందుకు కూడా బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. దేశంలో ప్రతిపక్షం లేకుండా చేయడమే ఆ పార్టీ లక్ష్యంగా కనిపిస్తోంది.

ఇందుకు తగిన అవకాశాలను పూర్తిగా వినియోగించుకోవాలన్నదే బీజేపీ వ్యూహంగా ఉంది. ప్రస్తుతం బీజేపీని గట్టిగా ఎదిరిస్తున్నది కాంగ్రెస్ కాకుండా ఆప్, సమాజ్‌వాదీ పార్టీ తదితర ప్రాంతీయ పార్టీలే. పంజాబ్‌లో ఆప్‌ను దెబ్బతీసి అధికారాన్ని చేజిక్కించుకోవడం కూడా బీజేపీ లక్ష్యంగా కనిపిస్తోంది. దేశమంతటా బీజేపీ పాలనలోకి తేవాలన్నదే తమ లక్ష్యమని అమిత్ షా ఇటీవల ఒక సందర్భంలో పేర్కొన్నారు. దానిని సాకారం చేసుకోవడానికి కమలనాథులు ప్రయత్నిస్తున్నారు. అయితే, ఈ ప్రయత్నాలు బెడిసికొట్టి మళ్లీ ప్రతిపక్షాలన్నీ ఒకే తాటిపైకి వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు.

Leave a Reply