పారదర్శకంగా ధార్మిక పోస్టుల భర్తీ…

ప్రశాంతంగా వేదపారాయణదారుల మౌఖిక పరీక్షలు
342 పోస్టులకు 5 వేలకుపైగా దరఖాస్తులు
వీడియో రికార్డింగ్‌తో ఎంపిక ప్రక్రియ
ప్రతిభ ఆధారంగానే నియామకాలు
దేవాదిశాఖ కమిషనర్ కే రామచంద్రమోహన్

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో ఖాళీగా ఉన్న ధార్మిక పోస్టుల భర్తీ ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. వేదపారాయణదారులు, అర్చకులు, పరిచారకులు, భజంత్రీలు, వంటస్వాములు తదితర 342 పోస్టుల భర్తీకి సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసి, దరఖాస్తుల పరిశీలన అనంతరం అభ్యర్థులకు హాల్ టికెట్లు అందజేసి, తొలి దశలో వేదపారాయణదారుల మౌఖిక పరీక్షలను ప్రారంభించినట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్రమోహన్ వెల్లడించారు. విజయవాడలోని మాడపాటి అతిథి గృహంలో సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన, రాష్ట్రంలోని ఆలయాల్లో ఖాళీగా ఉన్న వైదిక సిబ్బంది పోస్టులన్నింటినీ భర్తీ చేయాలని ముఖ్యమంత్రి ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఆ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఖాళీల వివరాలు సేకరించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా, కేంద్రీకృత పరీక్షా విధానంలో పూర్తి పారదర్శకతతో నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

ఈ నియామకాలకు రాష్ట్రవ్యాప్తంగా ఐదు వేల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని కమిషనర్ వెల్లడించారు. శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు ఉన్న మల్టీ జోన్-1 అభ్యర్థులకు విజయవాడలో, గుంటూరు నుంచి రాయలసీమ ప్రాంతాల మల్టీ జోన్-2 అభ్యర్థులకు సీతానగరంలో ఈ నెల 16వ తేదీ వరకు మౌఖిక పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎంపిక ప్రక్రియలో ఎలాంటి అనుమానాలకు తావులేకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఒక జోన్ అభ్యర్థులకు మరో జోన్‌కు చెందిన పండితులు పరీక్షలు నిర్వహిస్తుండగా, ఇద్దరు డిప్యూటీ కమిషనర్లు పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్నారని చెప్పారు.

అంతేకాకుండా మొత్తం పరీక్షా ప్రక్రియను వీడియో లైవ్ రికార్డింగ్ ద్వారా నమోదు చేస్తున్నట్లు వెల్లడించారు. విద్యార్హతలు, వేదార్హతలు, అనుభవం, మౌఖిక పరీక్షల్లో అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా మార్కులు కేటాయించి మెరిట్ జాబితా రూపొందిస్తామని కమిషనర్ వివరించారు. ఇందుకోసం మూడు ప్రత్యేక ఇంటర్వ్యూ బోర్డులను ఏర్పాటు చేసినట్లు, ఏ అభ్యర్థి ఏ బోర్డు ముందు హాజరవుతారో చివరి క్షణం వరకు తెలియకుండా ప్రత్యేక విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.

వేదపారాయణదారుల ఎంపిక ప్రక్రియ పూర్తయిన అనంతరం అర్చకులు, పరిచారకులు, భజంత్రీలు, వంటస్వాములు తదితర ధార్మిక పోస్టుల భర్తీని దశలవారీగా చేపడతామని రామచంద్రమోహన్ స్పష్టం చేశారు. రాష్ట్ర దేవాలయాల్లో ఖాళీల భర్తీతో ఆధ్యాత్మిక సేవలు మరింత బలోపేతం కావడంతో పాటు ఆలయ వ్యవస్థ నిర్వహణలో నాణ్యత పెరుగుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply