ఆదివాసి కవి మనోహర్ వ్యాసానికి అరుదైన గౌరవం

ఆదివాసి కవి మనోహర్ వ్యాసానికి అరుదైన గౌరవం

– ఇంటర్ పాఠ్యపుస్తకంలో స్థానం

ఉట్నూర్, ఆంధ్రప్రభ:
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతానికి చెందిన ఆదివాసి కవి, విశ్రాంతి ప్రిన్సిపల్ డాక్టర్ మెస్రం మనోహర్ రచించిన వ్యాసానికి అరుదైన గౌరవం లభించింది. ఆయన రాసిన “నవోదయం కథలహరి”లోని వ్యాసం తెలంగాణ ఇంటర్మీడియట్ తెలుగు పాఠ్యపుస్తకంలో చోటు దక్కించుకుంది.

తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం తెలుగు ఉపవాచకమైన “నవోదయం & కథాలహరి”లోని “పర్ధాన్‌ల సంస్కృతి విశేషాలు” అనే వ్యాసాన్ని పాఠ్యాంశంగా చేర్చడం ద్వారా ఆయన రచనకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు లభించింది. ఈ వ్యాసం ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకే కాకుండా తెలంగాణ సాహిత్య రంగానికి గణనీయమైన గౌరవాన్ని తీసుకొచ్చిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

డాక్టర్ మెస్రం మనోహర్ గిరిజన సంక్షేమ శాఖలో ఉపాధ్యాయుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఉద్యోగ బాధ్యతలతో పాటు రాజనీతి శాస్త్రం, ఆంగ్లంలో ఎం.ఏ డిగ్రీలు సాధించారు. పర్ధాన్ గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలపై పీహెచ్‌డీ పూర్తి చేసిన ఆయన కవి, పరిశోధకుడిగా విశిష్ట గుర్తింపు పొందారు.

ఉట్నూర్ సాహితీ వేదికను స్థాపించి అనేక యువ కవులను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారు. గిరిజన విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ప్రేరణాత్మక తరగతులు నిర్వహించారు. ఆయన చేసిన కృషి ఆదిలాబాద్ జిల్లాకే కాకుండా తెలంగాణ సాహిత్య లోకానికే గర్వకారణమని పలువురు పేర్కొంటున్నారు. తన వ్యాసం పాఠ్యపుస్తకంలో చోటు దక్కడం పట్ల డాక్టర్ మెస్రం మనోహర్ హర్షం వ్యక్తం చేశారు.

Leave a Reply