సైకిల్‌పై కలెక్టర్, జేసీ..
మీకోసం వేదికకు వినూత్నంగా ప్రయాణం!
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : భవిష్యత్తు తరాలకు మంచి పర్యావరణాన్ని అందించడంతో పాటు, శారీరక దృఢత్వానికి సైకిల్ తొక్కడం ఎంతో అవసరమని, ప్రతి సోమవారం మీకోసం గ్రీవెన్స్ డే రోజున జిల్లా అధికారులు అందరూ సైకిళ్లపై రావాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఇద్దరూ స్వయంగా సైకిళ్లు తొక్కుకుంటూ జిల్లా పరిషత్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,.. నగర పరిధిలో అధికారులు రెండు మూడు కిలోమీటర్ల మేర సైకిల్ తొక్కడం వల్ల చక్కని శారీరక శ్రమ కలిగి ఆరోగ్యం చేకూరుతుందన్నారు.
వాహనాల్లో వెళ్లేటప్పుడు గమనించలేని మన చుట్టూ ఉన్న పరిసరాలను, క్షేత్రస్థాయి పరిస్థితులను స్వయంగా కళ్లారా చూసే అవకాశం ఈ ప్రయాణం ద్వారా కలుగుతుందన్నారు . ఒకే మార్గంలో వివిధ శాఖల అధికారులు కలిసి సైకిళ్లపై ప్రయాణించడం వల్ల పరస్పర సమన్వయం పెరుగుతుందని, ఇది ఆయా శాఖల మధ్య సమన్వయంతో పనులు వేగంగా సాగడానికి దోహదపడుతుందని వివరించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన ఫిట్ ఇండియాను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని,.. అలాగే ఇటీవల విశాఖపట్నంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్వయంగా సైకిల్ తొక్కి ఇచ్చిన సందేశాన్ని ఎవరూ మర్చిపోకూడదని గుర్తుచేశారు. ఇప్పటికే సైకిళ్లపై కార్యాలయానికి చేరుకున్న అధికారులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. సైకిళ్లు అందుబాటులో లేని వారు లేదా సైకిల్ తొక్కడంలో ఇబ్బందులు ఉన్నవారు.. కనీసం ఈ-బైక్‌లను వినియోగించాలని సూచించారు. అధికారులు అంతా ఇదే బాటలో నడిచి ఆదర్శంగా నిలవాలని కలెక్టర్ కోరారు.
