Kaveri Seeds farmers loss | దిగుబడి ఆశలు ఆవిరి.. అప్పుల్లో అన్నదాతలు

Kaveri Seeds farmers loss | దిగుబడి ఆశలు ఆవిరి.. అప్పుల్లో అన్నదాతలు
Kaveri Seeds farmers loss | బాండ్ వ్యవసాయంలో రైతులకు చేదు అనుభవం
ములుగు, భద్రాద్రి జిల్లాల్లో వంగడాల వైఫల్యం
నష్టపోయిన రైతులను పట్టించుకోని సీడ్స్ యాజమాన్యం
Kaveri Seeds farmers loss | హైదరాబాద్, ఆంధ్రప్రభ ముఖ్య ప్రతినిధి: ఏజెన్సీ రైతులకు ఆశ చూపి బాండ్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న పలు కార్పొరేట్ కంపెనీలు కోట్ల రూపాయలను సంపాదించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే దిగుబడి ఎంత వస్తుందో కూడా తెలియని వంగడాలను రైతులకు అంటగట్టి వారి చేత పెట్టుబడులు పెట్టిస్తున్నాయి. సాగుకాలం పూర్తయి, దిగుబడి వచ్చే సమయానికి కనీస దిగుబడి రాక, పెట్టిన పెట్టుబడి సైతం తిరిగి పొందలేక అన్నదాతలు అప్పుల పాలవ్వాల్సి వస్తోంది.
కావేరీ సీడ్స్ పుణ్యమాని మరికొందరు రైతులు ఇలానే మోసపోయి గగ్గోలు పెడుతున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండల పరిధిలోని దామరవాయికి చెందిన దాదాపు 43 మంది రైతులు సుమారు 140 ఎకరాలు, కమలాపురం గ్రామానికి చెందిన రైతులు 30 ఎకరాలు, కోమటిపల్లి గ్రామానికి చెందిన రైతులు 73 ఎకరాలు, కొత్తూరు మెట్లగూడెం గ్రామానికి చెందిన రైతులు 18 ఎకరాలు, బోరునర్సాపురం రైతులు 10 ఎకరాలు, చేరుపల్లి రైతులు 3 ఎకరాలు, బాలనగూడెం రైతులు 26 ఎకరాలు, తొండ్యాల గ్రామ రైతులు 9 ఎకరాలు, తిమ్మంపేట రైతులు 23 ఎకరాలు, మల్లూరు గ్రామ రైతులు 9 ఎకరాల్లో కావేరీ సీడ్స్ వరి మేల్-ఫిమేల్ వంగడాలను సాగు చేపట్టారు.
తాడ్వాయి మండలంలోని దామరవాయి గ్రామంలో 30 ఎకరాలు, ఏటూరునాగారం మండలం దొడ్ల గ్రామంలో 81 ఎకరాలు, షాపల్లె గ్రామంలో 28 ఎకరాలు, చిన్నబోయినపల్లి గ్రామంలో 22 ఎకరాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండల పరిధిలోని యల్లాపురం గ్రామంలో 8 ఎకరాలు, వెంకటేశ్వరపురంలో 32 ఎకరాలు, పొల్లపల్లి గ్రామంలో 44 ఎకరాలు, కొండాయిగూడెం గ్రామంలో 18 ఎకరాల్లో ఈ పంటను సాగుచేశారు.
అయితే ఎకరాకు పది క్వింటాళ్ల ఫిమేల్ వరి ఉత్పత్తి కచ్చితంగా వస్తుందని ఆశ చూపిన కావేరీ సీడ్స్ నిర్వాహకులు, క్వింటాకు రూ.10 వేల మద్దతు ధరను ముందస్తుగా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. దీంతో పెద్ద ఎత్తున కొత్త రకం వంగడాల సాగుకు అన్నదాతలు మొగ్గు చూపారు.
కావేరీ సీడ్స్ నిర్వాహకులు పది క్వింటాళ్ల ఆశ చూపితే, ఎకరాకు రూ. లక్ష మేర దిగుబడి వస్తుందన్న భావనతో రైతులు కావేరీ సీడ్స్ బాండ్ వ్యవసాయానికి మొగ్గు చూపారు. ఎకరాకు సుమారు రూ.70 నుంచి 80 వేల వరకు పెట్టుబడి పెట్టారు.
అయితే పంటకాలం పూర్తయి, దిగుబడి వచ్చేనాటికి ఎకరాకు క్వింటా దిగుబడి కూడా రాకపోవడంతో చేతికి కనీసం పదివేల రూపాయలు కూడా వచ్చే పరిస్థితి లేదని వారు ఆందోళన చెందుతున్నారు. ఇదే విషయమై తమకు కనీస దిగుబడి హామీతో పాటు ఇస్తామన్న పరిహారాన్ని చెల్లించాలని కోరుతున్నప్పటికీ, నిర్వాహకులు కనీసం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.
మొహం చాటేసిన కావేరీ సీడ్స్ నిర్వాహకులు
ఏజెన్సీ ప్రాంత రైతులతో బాండ్ వ్యవసాయం చేయించిన కావేరీ సీడ్స్ నిర్వాహకులు, దిగుబడి రాక అన్నదాతలు నిండా మునిగిన వేళ మొహం చాటేయడం విమర్శలకు దారితీస్తోంది.
